గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 21:35:10

లాక్‌డౌన్‌ సమయంలో స్కూలు ఫీజులేంటి?

లాక్‌డౌన్‌ సమయంలో స్కూలు ఫీజులేంటి?

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రైవేటు పాఠశాలలకు మూడు నెలల ఫీజు మాఫీ చేయాలని, పాఠశాలలు మొదలయ్యే వరకు ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రాష్ట్రాల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో చాలా మంది తల్లిదండ్రులు ఫీజు చెల్లించలేక పోవడంతో పిల్లలను పాఠశాల నుండి తొలగించవద్దని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. లాక్‌డౌన్‌ విధించిన కాలానికి ప్రైవేటు పాఠశాలలు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఫీజులను అడగకుండా చూసేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టుకు వారు విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా పనులు కరువై, ఉద్యోగాలు లేక, జీతాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇలాంటి సమయంలో ఫీజులు కట్టాలంటూ ఒత్తిడి తేవడం ఎలా సముచితమని  వారు ప్రశ్నించారు. 

బోర్డు ఫలితాలు ఇంకా రాలేదని, పిల్లలు ఎటువైపు వెళ్ళాలో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీలు లేనందున వారు చదువుకోలేకపోతున్నారని విచారం వ్యక్తం  చేశారు. దేశంలోని చాలా మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు లేనప్పటికీ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలంటూ ఒత్తిడి  చేస్తున్నారని, దీంతో తిండి మానుకొని స్మార్ట్‌ఫోన్లు కొనాల్సిన దుస్థితి నెలకొన్నదని వారు చెప్పారు. 


logo