న్యూఢిల్లీ : కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ఆందోళన రేకెత్తిస్తోంది. అల్ఫా వేరియంట్ కంటే డెల్టా 40 నుంచి 60 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ (ఎన్టీఏజీఐ) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో తొలుత భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ దేశంలోకరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి దారితీసింది. ప్రస్తుతం వెల్లడవుతున్న తాజా కేసుల్లో 80 శాతం కేసులు ఈ వేరియంట్ నుంచే నమోదవుతున్నాయి.
డెల్టా వేరియంట్ ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్ సహా 80కి పైగా దేశాల్లో వ్యాప్తి చెందిందని డాక్టర్ అరోరా అన్నారు. భారత్‌లో ఫస్ట్ వేవ్ తరహాలోనే సెకండ్ వేవ్‌లోనూ మరణాల సంఖ్య నమోదవడంతో డెల్టా వేరియంట్ ఇతర వేరియంటలతో పోలిస్తే తీవ్ర లక్షణాలకు దారితీస్తుందని చెప్పలేమని పేర్కొన్నారు.
భారత్‌లో అందుబాటులో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని వెల్లడైందని , ఇది ఊరట కలిగించే పరిణామమని అరోరా తెలిపారు. దేశంలో ప్రస్తుతం కొవాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా అమెరికన్ ఫార్మా కంపెనీ మోడెర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి ఆమోదముద్ర లభించింది.