ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 16:01:48

ఏడుసార్లు ప్లాస్మా దానం.. ఢిల్లీ మొదటి డోనర్ ఔదార్యం

ఏడుసార్లు ప్లాస్మా దానం.. ఢిల్లీ మొదటి డోనర్ ఔదార్యం

న్యూ ఢిల్లీ: అతడు కరోనా బారినపడి కోలుకున్నాడు. ఆ బాధేంటో తెలుసుగనుక ఇతర రోగులకు చికిత్సకోసం ప్లాస్మా దానానికి ముందుకొచ్చాడు. ఢిల్లీ సర్కారు ప్రకటన చూసి మొదటిసారి ప్లాస్మా డొనేట్‌ చేశాడు. మాకు ప్లాస్మా కావాలంటూ వినతులు వెల్లువెత్తడంతో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడుసార్లు దానం చేశాడు. కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకొచ్చి, ప్లాస్మా డొనేట్‌ చేయాలని పిలుపునిస్తున్నాడు. 

ఢిల్లీలోని జహింగీర్‌పురికి చెందిన తబ్రేజ్‌ఖాన్‌(36) గత మార్చిలో కరోనాబారినపడ్డాడు. ఏప్రిల్‌ 5న కోలుకున్నాడు. అనంతరం ప్లాస్మా దానం చేసేవారు ముందుకురావాలనే ప్రభుత్వ ప్రకటన చూశాడు. వెంటనే వెళ్లి మొదటిసారి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలియరీ సైన్సెన్‌(ఐఎల్‌బీఎస్‌)లో ప్లాస్మా డొనేట్‌ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అప్పటినుంచి ఇతడికి ప్లాస్మా కోసం వినతులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకూ అతడు రెండుసార్లు ఐఎల్‌బీఎస్‌, ఒకసారి మ్యాక్స్‌, రెండు సార్లు సర్‌ గంగారాం హాస్పిటల్‌, ఒకసారి శ్రీ అగ్గార్షియన్‌ ఇంటర్నేషనల్‌ దవాఖానలో ప్లాస్మాదానం చేశాడు. కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ దీన్ని దానం చేయవచ్చని, మనకు ఖర్చేమీ అవ్వట్లేదని, పైగా బలహీనంగా కూడా అనిపించడం లేదని ఖాన్‌ వెల్లడించాడు. 

దేవుడే ఈ మంచి పని చేయిస్తున్నాడు..

కొవిడ్‌ నుంచి కోలుకున్నాక తాను చాలా వివక్షకు గురవుతున్నానని తబ్రేజ్‌ఖాన్‌ తెలిపాడు. ఇంతకుముందు చాయ్‌ తాగేందుకు పిలిచేవారని, ఇప్పుడు తనను చూస్తేనే ముఖం చాటేస్తున్నారని చెప్పాడు. తబ్లిగీ జమాతేతో సంబంధం ఉందని, తాము కావాలని వైరస్‌ వ్యాప్తిచెందిస్తున్నామంటూ ఓ వర్గం వారు అంటున్నారని ఆవేదన చెందాడు. ప్లాస్మా దానం కూడా దాన్ని కవర్‌ చేయడానికే అన్నట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. కానీ, తాను ప్లాస్మా దానం చేసిన ఏడుగురిలో ఐదుగురు ఆ వర్గంవారే ఉన్నారని తెలిపాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే ఇన్నిసార్లు ప్లాస్మాదానం చేశానని, దేవుడే తనతో ఈ మంచి పనిచేయిస్తున్నాడని ఖాన్‌ పేర్కొన్నాడు.

 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo