బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 08:33:15

ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌కు బెదిరింపులు

ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌కు బెదిరింపులు

న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌కు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. స్వాతి మాలివాల్‌ను చంపుతామని ట్విట్టర్‌ ద్వారా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో స్వాతి మాలివాల్‌ ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని తీవ్రంగా బెదిరిస్తున్నారని, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను చంపుతామని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన బాయ్స్‌ లాకర్‌ రూమ్‌ ఇన్‌స్టా గ్రూపుపై స్వాతి మాలివాల్‌ తీవ్రంగా స్పందించారు. ఈ గ్రూపులో అమ్మాయిలపై సామూహిక అత్యాచారం ఎలా చేయాలి? అనే అంశాలపై కొందరు యువకులు చర్చించిన విషయం తెలిసిందే. అదే విధంగా తీహార్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న జామియా మిలియా విద్యార్థిని సఫురా జార్గార్‌ గర్భవతి. జార్గార్‌ గర్భధారణకు సంబంధించి పలువురు నెటిజన్లు అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. సఫురాకు మద్దతుగా స్వాతి మాలివాల్‌ స్పందించారు. సఫురాను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు స్వాతి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో స్వాతికి బెదిరింపులు అధికమయ్యాయి. 


logo