సోమవారం 30 మార్చి 2020
National - Feb 27, 2020 , 14:43:26

షాపుకు నిప్పు.. ఊపిరాడక వృద్ధురాలు మృతి

షాపుకు నిప్పు.. ఊపిరాడక వృద్ధురాలు మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. 23వ తేదీ నుంచి నిన్నటి వరకు చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ 85 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉంది. ఈశాన్య ఢిల్లీలో అక్బరీ అనే వృద్ధురాలు నాలుగు అంతస్తుల భవనంలో తన కుమారుడితో కలిసి ఉంటోంది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అక్బరీ నివాసం వద్దకు సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు వచ్చారు.

గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న బట్టల దుకాణానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మూడు, నాలుగో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించాయి. మూడో అంతస్తులో ఉన్న అక్బరీ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. తన తల్లిని కాపాడుకునేందుకు కుమారుడు సయీద్‌ సల్మానీ ప్రయత్నించగా, అతడిని కూడా చంపుతామని ఆందోళనకారులు బెదిరించారు. ఈ ప్రమాదం నుంచి సయీద్‌ నలుగురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. అక్బరీ మృతదేహాన్ని మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లి మృతిపై సయీద్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిని, బట్టల దుకాణంతో పాటు ఇల్లును కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు సయీద్‌. 


logo