శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 02:35:15

సహాయ కేంద్రాల్లో ‘వైరస్‌' కలకలం

సహాయ కేంద్రాల్లో ‘వైరస్‌' కలకలం
  • పలు అనారోగ్య సమస్యలతో ఢిల్లీ బాధితులు సతమతం
  • 44కి పెరిగిన హింస మృతులు
  • పరిహారం పెంచిన ఢిల్లీ సర్కార్‌
  • ఆప్‌ నేత తాహిర్‌ అరెస్ట్‌

న్యూఢిల్లీ, మార్చి 5: మత ఘర్షణలతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీని ప్రస్తుతం ‘కరోనా’ వణిస్తున్నది. సర్వం కోల్పోయి సహాయ కేంద్రాల్లో తలదాచుకున్న హింసాకాండ బాధితులు అనారోగ్యంతో సతమవుతున్నారు. ముస్తాఫాబాద్‌లోని ఈద్గా వద్ద ఉన్న సహాయ కేంద్రంలో పలువురు జలుబు, జ్వరం, దగ్గు, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే ఒకరికి ‘కరోనా’ సోకిన నేపథ్యంలో వీరంతా ఆందోళన చెందుతున్నారు. పలు వైద్య సంఘాలు ఉచిత శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నాయి. పరిశుభ్రత పాటించాలని, చేతులను శుభ్రపరచుకోవాలని వారికి సూచిస్తున్నాయి. ఢిల్లీ లెఫ్ట్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌, మంత్రి గోపాల్‌ రాయ్‌ గురువారం అల్లర్ల ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. 


మృతుల సంఖ్యపై సందిగ్ధం

హింసాకాండ మృతుల సంఖ్యపై సందిగ్ధం నెలకొన్నది. రెండు ప్రభుత్వ దవాఖానల్లో కొన్ని గుర్తించని మృతదేహాలు ఉండటంతో మరణించిన వారిసంఖ్యను 53గా అధికారు లు గురువారం పేర్కొన్నారు. అయితే వారు హింసాకాండలోనే చనిపోయారో లేదో నిర్ధారణకాకపోవడంతో సంఖ్యను 44గా నిర్థారించారు. మత ఘర్షణలకు సంబంధించి 654 కేసులు నమోదు చేసి 1820 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 


తాహిర్‌ పిటిషన్‌ కొట్టివేత

ఆప్‌ కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐబీ అధికారి అంకిత్‌ శర్మను హత్యచేసినట్టు  ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్‌.. కొన్నాళ్లుగా  పరారీలో ఉన్నాడు.  లొంగిపోయేందుకు అతడు దాఖలుచేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు తాహిర్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 24న చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు పోలీసులపై రాళ్ల దాడిచేస్తున్న వీడియో వెలుగుచూసింది. కొందరు మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. మత ఘర్షణల్లో సర్వం దోపిడీకి గురైన బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రూ.లక్షకు, పాక్షికంగా వస్తువుల దోపిడీకి గురైన వారికి రూ.50 వేలు పరిహారం ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ధ్వంసమైన పాఠశాలలకు రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. 


logo