ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 21:17:49

ఢిల్లీలో తొలిసారి 5 వేలకుపైగా కరోనా కేసులు

ఢిల్లీలో తొలిసారి 5 వేలకుపైగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా కేసుల నమోదులో ఢిల్లీ మరో రికార్డు సృష్టించింది. తొలిసారి 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,673 కరోనా కేసులు వెలుగు చూశాయి. సెప్టెంబర్‌ 16న ఢిల్లీలో అత్యధికంగా 4,443 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఈ సంఖ్య 4,853గా ఉండగా బుధవారం 5,673కు చేరింది. పాజిటివ్‌ కేసుల నమోదు రేటు 9 శాతానికి పెరిగింది. ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచడంతో ఈ నెలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం తొలిసారి ఢిల్లీ నగరంలో 17 వేలకుపైగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. 

కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా సోకితే మిగతా సభ్యులతోపాటు వారిని కలిసిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని దీంతో పాజిటివ్‌ కేసుల నమోదు రేటు పెరుగుతున్నదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. మరోవైపు రానున్న శీతాకాలంలో ఢిల్లీలో రోజువారి కరోనా కేసుల నమోదు 15 వేల వరకు ఉండవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పౌల్‌ నేతృత్వంలోని నిఫుణుల కమిటీ హెచ్చరించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.