మంగళవారం 31 మార్చి 2020
National - Feb 12, 2020 , 03:19:37

అల హస్తినాపురములో..సరిలేరు నీకెవ్వరు

అల హస్తినాపురములో..సరిలేరు నీకెవ్వరు
  • మధ్యతరగతి బిడ్డ.. ఢిల్లీ రాజుగా ఎదిగిన వైనం
  • ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి.. సమాజ సేవకు కదిలిన కేజ్రీవాల్‌
  • మెగసెసే అవార్డు ద్వారా వచ్చిన డబ్బులతో ఎన్జీఓ స్థాపన
  • ‘ఆప్‌' స్థాపించి సామాన్య ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
  • విపక్షాల విమర్శల్ని సైతం అనుకూలంగా మార్చుకోగల నేర్పరి

న్యూఢిల్లీ: సామాన్యుడికే ఢిల్లీ మళ్లీ నీరాజనం పలికింది. పేద, మధ్యతరగతి ప్రజల నేస్తంగా ముద్రపడిన అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆవ్‌ుఆద్మీ పార్టీ(ఆప్‌)కే ఢిల్లీ ప్రజలు తిరిగి పట్టం కట్టారు. ఇది కేజ్రీవాల్‌ ఒక్క రోజులో సాధించిన విజయం కాదు. ప్రజలకు సేవ చేయాలన్న అకుంఠిత దీక్షే ఆయన్ని ప్రస్తుతం ఈ స్థాయికి తీసుకొచ్చింది. 

సమాజం కోసం ఉన్నతోద్యోగాన్ని వదిలి..

హర్యానాలోని హిసార్‌లో ఒక మధ్య తరగతి కుటుంబంలో 1968 ఆగస్టు 16న  కేజ్రీవాల్‌ జన్మించారు. గోబింద్‌రావ్‌ు కేజ్రీవాల్‌, గీతాదేవి దంపతులకు ఆయన మొదటి సంతానం. ప్రఖ్యాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కేజ్రీవాల్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తర్వాత 1989లో టాటా స్టీల్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. మూడేండ్ల తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) పరీక్ష రాసి ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారిగా కొలువు సాధించారు. ‘పరివర్తన్‌' పేరిట ఓ ఎన్జీఓను స్థాపించి మురికివాడల ప్రజల అభ్యున్నతికి కృషిచేశారు. 2006లో ఆయనకు రామన్‌ మెగసెసే పురస్కారం లభించింది. అదే ఏడాది ఫిబ్రవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా మారారు. ‘పబ్లిక్‌ కాజ్‌ రీసర్చ్‌ ఫౌండేషన్‌' అనే మరో ఎన్జీఓను స్థాపించి మెగసెసే అవార్డు ద్వారా వచ్చే నగదును ఎన్జీఓ నిధులుగా ఉపయోగించారు. 


రాజకీయ ప్రస్థానం 

2011లో జన లోకపాల్‌ బిల్లు కోసం ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్‌ ఢిల్లీలో తన పోరాటాన్ని కొనసాగించారు. ఈ బిల్లు కోసం చేపట్టిన నిరాహార దీక్ష ప్రజల్లో ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది. దీంతో రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించాలన్న ఆశయంతో 2012లో ఆప్‌ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. 2013 డిసెంబర్‌లో ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆప్‌ 28 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ మద్దతుతో ఢిల్లీ 7వ సీఎంగా కేజ్రీవాల్‌ పదవి చేపట్టారు. అయితే 49 రోజులు కాకముందే కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య ముసలం మొదలై సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. 2015 ఎన్నికల్లో ఆప్‌ ఏకంగా 67 సీట్లను సాధించి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


ఢిల్లీ గద్దెపై రారాజుగా.. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో కేజ్రీవాల్‌ తన వ్యూహాలకు పదునుపెట్టారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టారు. సభల్లో హనుమాన్‌ చాలీసాను పఠించి హిందుత్వ వ్యతిరేకి అన్న బీజేపీ ఆరోపణలు తప్పని నిరూపించారు. ప్రధాని మోదీపై పాక్‌ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ‘మోదీ భారత ప్రధాని, ఆయన నాకు కూడా ప్రధానే. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోం’ అని  కేజ్రీవాల్‌ స్పందించడం ప్రజల మనసు గెలుచుకున్నది. ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై విమర్శల మీద కాకుండా.. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే ఆయన దృష్టిపెట్టారు.  పెద్ద కొడుకులా పని చేస్తానని హామీనిచ్చిన కేజ్రీవాల్‌ను ఢిల్లీవాసులు నమ్మారు. మూడోసారి పట్టం కట్టారు. 


logo
>>>>>>