మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 01:12:48

ప్రశాంతంగా ఢిల్లీ

ప్రశాంతంగా ఢిల్లీ
  • పెరిగిన ప్రజల కదలికలు
  • షాహీన్‌ బాగ్‌లో 144 సెక్షన్‌
  • భారీగా పోలీసుల మోహరింపు

న్యూఢిల్లీ, మార్చి 1: ఈశాన్య ఢిల్లీ కోలుకుంటున్నది. క్రమంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్నది. వారం రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాల కోసం బయటకు వస్తున్నారు. వాహనాల రాకపోకలు పెరిగాయి. దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు, భద్రతా సిబ్బందిని మోహరించారు. షాహీన్‌బాగ్‌లో ముందు జాగ్రత్తగా పోలీసులు ఆదివారం 144 సెక్షన్‌ విధించారు.  

నాలుగు మృతదేహాల వెలికితీత

గోకల్‌పురి, శివ్‌ విహార్‌ ప్రాంతాల్లోని మురికి కాలువల నుంచి సహాయ సిబ్బంది ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. ముస్తాఫాబాద్‌ ప్రాంత వాసులు ఆచితూచి బయటకు వస్తున్నారు. ఢిల్లీ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ మాట్లాడుతూ ఢిల్లీలో మత సామరస్యం నెలకొల్పడమే తన ప్రాధాన్యమన్నారు. సీనియర్‌ పోలీసు అధికారులు స్థానికులతో సామూహిక సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు 254 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 903 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాకాండపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ) రెండు నిజ నిర్ధారణ కమిటీలను నియమించింది. ఈశాన్య ప్రాంత స్కూళ్లలో ఇప్పటికే వార్షిక పరీక్షలను వాయిదా వేశారు. మరోసారి వాయిదా వేయడం వల్ల విద్యార్థులు.. నీట్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే అవకాశాలపై ప్రభావం పడుతుందని సీబీఎస్‌ఈ ఆందోళన వ్యక్తంచేసింది. ఈశాన్య, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో 10వ, 12వ తరగతి పరీక్షలను గత నెల 29 వరకు సీబీఎస్‌ఈ వాయిదా వేసింది. కాగా, వివిధ స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు  బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. బాధితులకు అవసరమైన సహాయ సామగ్రిని అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. 


బాధిత ప్రాంతాల్లో శ్రీశ్రీ రవిశంకర్‌ పర్యటన

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌  హింసాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులు తీవ్ర వేదనకు గురయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సి ఉన్నదన్నారు. మరోవైపు సీఏఏ వ్యతిరేక నిరసనలకు కేంద్రమైన షాహీన్‌బాగ్‌లో పోలీసులు ఆదివారం 144 సెక్షన్‌ విధించారు. ఆందోళనకారులను ఖాళీ చేయించేందుకు ఆదివారం ప్రదర్శన జరుపుతామన్న ‘హిందూసేన’.. శనివారం పోలీసులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. అయినప్పటికీ పోలీసులు భారీగా మోహరించారు.
logo