గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 12:55:36

డాక్టర్‌ ఆత్మహత్య కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు

డాక్టర్‌ ఆత్మహత్య కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్టు

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ అతని సహాయకుడు కపిల్‌ నగర్‌ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ వైద్యుడి ఆత్మహత్య కేసులు పోలీసులు ఇరువురుని అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీలోని దుర్గా విహార్‌లో ఓ వైద్యుడిని ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేయడం, దోచుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డట్లుగా ఆరోపణ. అనంతరం సదరు వైద్యుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు నెబ్‌ సరాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. విచారణ చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యేను, అతని సహాయకుడిని అరెస్టు చేసినట్లు డీసీపీ అతుల్‌ థాకూర్‌ తెలిపారు. 

ఎమ్మెల్యే గడిచిన శుక్రవారం నాడు ఢిల్లీ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మృతిచెందిన వ్యక్తి వైద్య వృత్తితో పాటు చిన్నపాటి బిజినెస్‌ చేసేవాడు. 2005 నుంచి ఢిల్లీ జల్‌ బోర్డు సహాకారంతో వాటర్‌ ట్యాంకర్‌ను నడిపిస్తుండేవాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి జర్వాల్‌ అతన్ని నెలవారీ మాముళ్లు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. ఇవ్వకపోతే వాటర్‌ బోర్డు నుంచి ట్యాంకర్‌ను తీసేపిస్తానని అదేవిధంగా రావాల్సిన పెండింగ్‌ బిల్లులు రాకుండా చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లుగా ఆరోపణ.


logo