సోమవారం 13 జూలై 2020
National - Jun 23, 2020 , 09:18:40

ప్లాస్మా దాత ముసుగులో ఢిల్లీ స్పీక‌ర్‌కు టోక‌రా!

ప్లాస్మా దాత ముసుగులో ఢిల్లీ స్పీక‌ర్‌కు టోక‌రా!

న్యూఢిల్లీ: అత‌గాడు ఒక మోస‌గాడు! తానొక‌ వైద్యుడిని అని చెప్పుకుంటాడు! త‌న‌కు క‌రోనా వ‌చ్చి త‌గ్గిందని చెబుతాడు! అవ‌స‌ర‌మైన వారికి తాను ప్లాస్మా దానం చేస్తాన‌ని న‌మ్మ‌బ‌లుకుతాడు! ప్లాస్మా కోసం ఎవ‌రైనా సంప్ర‌దిస్తే.. ప్ర‌యాణ ఖ‌ర్చులకు త‌న ఖాతాలో పైస‌లు వేయ‌మంటాడు! ఒక్క‌సారి ఖాతాలో పైస‌లు ప‌డ్డాయంటే ఖ‌తం అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది! బాధితుల‌కు మోస‌పోయామ‌ని గ్ర‌హిస్తారు! ఇలా ఒక్క‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఎంతో మందిని అత‌డు మోసం చేశాడు. ఆఖ‌రికి ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ రామ్ నివాస్ గోయ‌ల్ సైతం ఈ మాయ‌గాడి వ‌ల‌లో చిక్కాడు.

అబ్దుల్ క‌రీం రానా అనే యువ‌కుడు ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రిలో వైద్యుడిగా, ప్లాస్మా దాత‌గా చెప్పుకుంటూ ప‌లువురిని మోసం చేశాడు. త‌న‌కు ఇటీవ‌ల క‌ర‌నా వ‌చ్చి త‌గ్గింద‌ని, ప్లాస్మా దానం చేస్తాన‌ని చెబుతూ.. సోష‌ల్ మీడియాలో ప్లాస్మా దాత‌ల కోసం వెతికే వారే ల‌క్ష్యంగా క‌రీం రానా మోసాల‌కు పాల్ప‌డ్డాడు. ప్ర‌యాణ ఖ‌ర్చుల పేరుతో ప‌లువురి నుంచి పైస‌లు గుంజి ప‌త్తాలేకుండా పోయేవాడు. ప్లాస్మా చికిత్స మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇత‌గాడి మోసాల పరంప‌ర కొన‌సాగిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ రాంనివాస్ గోయ‌ల్‌ను కూడా క‌రీం రానా మోసం చేశాడు. త‌న బంధువుకు ప్లాస్మా చికిత్స చేయించ‌డం కోసం క‌రీం రానాను సంప్ర‌దించిన స్పీక‌ర్‌.. అత‌డు ర‌వాణా ఖ‌ర్చుల‌కు డ‌బ్బు వ‌సూలు చేసి ముఖం చాటేయ‌డంతో ఈ నెల 20న పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. స్పీక‌ర్ ఫిర్యాదు మేర‌కు నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు క‌రీం రానాను అరెస్ట్ చేశారు. అత‌ను ఇంకా ఎంత ‌మందిని ఇలా మోసం చేశాడ‌నే వివ‌రాల‌ను రాబ‌డుతున్నారు. 


 


    


logo