మంగళవారం 31 మార్చి 2020
National - Mar 20, 2020 , 08:13:57

నిర్భయ దోషులకు ఉరి

నిర్భయ దోషులకు ఉరి

-అన్ని పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానాలు

-న్యాయపరమైన అన్ని అవకాశాలు మూత

-నేటి ఉదయం 5.30 గంటలకు నలుగురికి శిక్ష అమలు

తెలతెలవారే సమయం.. వెచ్చని కిరణాల్ని ప్రసరిస్తూ తూర్పు కొండల మధ్య నుంచి మెల్లిగా ఉదయిస్తున్న ఎర్రని సూర్యుని సాక్షిగా ఎట్టకేలకు వారి పాపం పండింది. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ‘నిర్భయ ఘోర కలి’ దోషులకు.. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప, ఇప్పటికే ఉరి శిక్ష అమలై ఉంటుంది.

న్యూఢిల్లీ, మార్చి 19:  నిర్భయపై లైంగిక దాడి ఘటనలో ఉరిశిక్ష పడిన తమకు డెత్‌ వారెంట్‌ను మరోసారి మార్చాలన్న దోషుల పిటిషన్‌లను సుప్రీంకోర్టు సహా పలు కోర్టులు గురువారం కొట్టేశాయి. దోషుల్ని ఉరితీయడంలో భాగంగా దక్షిణాసియాలోనే అతిపెద్దదైన తీహార్‌ జైలులో గురువారం అధికారులు డమ్మీ ఉరి రిహార్సల్స్‌ను పూర్తి చేశారు. 

తీహార్‌లో ఉరి

నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు దోషుల కోసం తీహార్‌ జైలు సిబ్బంది.. గురువారంనాడే ఇందుకు సంబంధించిన పలు రిహార్సల్స్‌ను నిర్వహించారు. పార్లమెంటుపై దాడులకు పాల్పడిన కేసులో దోషిగా తేలిన అఫ్జల్‌ గురుని ఉరి తీసిన ఏడేండ్ల తర్వాత మరోసారి నిర్భయ దోషుల కోసం జైలు అధికారులు ఉరి కంబాన్ని ఏర్పాటు చేశారు. దోషుల్ని ఉరితీసిన తలారి పవన్‌ జల్లాద్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి మంగళవారమే తీహార్‌కు చేరుకున్నారని సీనియర్‌ జైలు అధికారి ఒకరు తెలిపారు. ఉరి తీసే తాళ్లను, ఉరికంబాన్ని పరీక్షించడం తదితరాల్ని గురువారమే జైలు సూపరింటెండెంట్‌ అధికారి పర్యవేక్షించారు. ఇక, నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు అధికారులు పాటించిన నిబంధనలు జైలు మ్యాన్యువల్‌లో పేర్కొన్నారు. వాటి ప్రకారం.. డమ్మీ ఉరి రిహార్సల్‌లో భాగంగా దోషి శరీర బరువుకు 1.5 రెట్లు ఎక్కువ బరువున్న ఇసుకతో నింపిన సంచుల్ని ఉరితాళ్లకు బిగించి 1.830 నుంచి 2.440 మీటర్ల కిందకు వదులుతారు. ఉరి తాళ్ల నాణ్యతను పరీక్షించేందుకు దీన్ని చేపడుతారు. ఢిల్లీ జైలు నిబంధనలు, 2018 ప్రకారం.. ఈ రిహార్సల్స్‌ జరిపేటప్పుడు జైలు సూపరింటెండెంట్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌, ఇంచార్జి వైద్యాధికారి, జైలుకు చెందిన మరో వైద్యాధికారి, జిల్లా కలెక్టర్‌ లేదా అదనపు జిల్లా కలెక్టర్‌, కనీసం పది మంది కలిగిన కానిస్టేబుల్స్‌ బృందం, హెడ్‌ వార్డన్స్‌, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుల్స్‌, ఇద్దరు వార్డన్స్‌ సమక్షంలో ఉరితీత కార్యక్రమం జరుగుతుంది. 

అయితే, ఉరితీత జరిగేటప్పుడు దోషుల కుటుంబ సభ్యుల్ని అనుమతించరు. ఉరితీత జరిగి, దోషుల మృతదేహాల్ని జైలు నుంచి తరలించేంతవరకూ కారాగారంలో ఉన్న మిగతా ఖైదీల్ని జైలులోపల తిరగకుండా నిర్భందిస్తారు. ఉరి తాడుకు దోషుల్ని(ఒక్కొక్క దోషికి విడివిడిగా) ఎంత కింది వరకూ వేలాడదీయాలన్న విషయాన్ని ఉరి జరిగే తేదీకి నాలుగు రోజుల ముందే వైద్యాధికారి నిర్ణయిస్తారు. ఉరి కోసం అదనంగా మరో రెండు తాళ్లను(ఒక్కో దోషి చొప్పున) సిద్ధం చేసుకుంటారు. ఉరికి ముందు పరీక్షించిన ఉరి తాడు, ఇతర సామగ్రిని ఓ స్టీల్‌ పెట్టెలో ఉంచి ఇంచార్జి డిప్యూటీ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో భద్రపరుస్తారు. ఉరికంబం ఎక్కనున్న దోషికి ఇతరత్రా నమ్మకాలుంటే మతాధికారిని అనుమతిస్తారు. ఉరితీసే రోజు ఉదయం.. జైలు సూపరింటెండెంట్‌, వైద్యాధికారి, జిల్లా కలెక్టర్‌ లేదా అదనపు జిల్లా కలెక్టర్‌ దోషి ఉన్న సెల్‌లోకి వెళ్లి దోషిని కలుస్తారు. చివరి కోరిక వంటి ఇతరత్రా విషయాలున్న పత్రాలపై దోషి సంతకాల్ని తీసుకుంటారు. ఉరికంబం ఎక్కేముందు దోషి ముఖాన్ని కాటన్‌ వస్త్రంతో కప్పుతారు. జైలు నిబంధనల ప్రకారం దోషి ఉరికంబాన్ని చూడకూడదన్న నిబంధనతో ఈ విధంగా చేస్తారు. వార్డెన్లు దోషిని పట్టుకుంటారు. సూపరింటెండెంట్‌ సంజ్ఞ చేయగానే వార్డెన్లు దోషిని విడిచిపెడతారు. ఆ తర్వాత తలారి బోల్టును లాగుతాడు అని జైలు మ్యాన్యువల్‌ ద్వారా తెలుస్తున్నది. ఉరితీసిన దోషి మృతదేహానికి పోస్ట్‌ మార్టం జరిపి.. కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఖననం చేయడానికి మృతదేహాన్ని స్మశానంకి తరలించడానికి ఆంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. 

అన్ని కోర్టుల్లో చుక్కెదురు

నిర్భయ దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు చివరివరకూ పలు ఎత్తుగడలు వేశారు. తమలో ఒకడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముందు రెండోసారి క్షమాభిక్షకు పిటిషన్‌ పెట్టుకున్నాడని, ఇంకా అది పెండింగులోనే ఉన్నదని.. ఈ కారణంచేత ఉరి శిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ముగ్గురు అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టేసింది. మరోవైపు, తాను రెండోసారి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ కుమార్‌ పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇంకోవైపు, బీహార్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టులో అక్షయ్‌ భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ పెండింగులో ఉన్నదని పేర్కొంటూ దోషుల తరుఫున న్యాయవాది ఆ విషయాల్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన న్యాయస్థానం.. ఆయా పిటిషన్లను ఆధారంగా చేసుకొని ఉరి శిక్షపై స్టే విధించలేమని వెల్లడిస్తూ.. సదరు పిటిషన్లను కొట్టేసింది. ఇదే విడాకుల అంశంపై దోషుల తరుఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టును గురువారం రాత్రి ఆశ్రయించగా అక్కడ కూడా దోషులకు చుక్కెదురైంది. ఆఖరు నిమిషంలో క్షమాభిక్ష పిటిషన్లు వేసి శిక్ష అమలును వాయిదా వేస్తూ దోషులు కుట్ర పన్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగిన డిసెంబర్‌ 12, 2012 రోజున తాను ఢిల్లీలో లేనంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ సింగ్‌ పెట్టుకున్న పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది.     

నా కూతురు ఆత్మకు శాంతి: నిర్భయ తల్లి

ఉరిశిక్షను వాయిదా వేయాలని దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. తన కూతురు ఆత్మకు ఎట్టకేలకు శాంతి లభించిందని, ఏడేండ్ల తర్వాత తనకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. logo
>>>>>>