ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 13:04:14

మైనారిటీ కమిషన్ మాజీ చీఫ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు

మైనారిటీ కమిషన్ మాజీ చీఫ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు

ఢిల్లీ : దేశ ద్రోహం కేసులో ఢిల్లీ మైనారిటీ క‌మిష‌న్ మాజీ అధ్య‌క్షుడు జ‌ఫారుల్ ఇస్లాం ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు నేడు ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేసింది. కేసు విచార‌ణ‌లో తదుపరి దర్యాప్తు కోసం ఖాన్ అవసరం లేదని పోలీసులు చెప్పడంతో జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ బెయిల్‌ను మంజూరు చేశారు. కమిషన్ చీఫ్ గా ఖాన్ పదవీకాలం ఇటీవలే ముగిసింది. తన వయస్సు, ఆరోగ్య సమస్యలు, కోవిడ్‌-19 సోకే ప్రమాదం ఉందని పేర్కొంటూ తనపై నమోదైన దేశద్రోహ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఖాన్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేసింది. 

ఖాన్ తన తాజా పేస్‌బుక్ పేజీ పోస్టులో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశంలో ద్వేషపూరిత ప్రచారాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఎటువంటి విచార‌ణ‌లు లేకుండా హ‌త్య‌లు, అల్లర్ల‌కు పాల్ప‌డుతున్న‌రాన్నారు. దీనిపై అరబ్ దేశాలకు అదేవిధంగా ముస్లిం ప్రపంచానికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంటూ హిందుత్వ పెద్ద‌ల‌ను బెదిరించాడు. హిందుత్వ వాదులు ర‌క్త‌పాతాన్ని ఎదుర్కొంటారని బెదిరింపుల‌కు గురిచేశాడు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఖాన్‌పై సెక్షన్ 124 ఎ, 153 ఎ కింద కేసు నమోదు చేశారు. అంత‌కుక్రితం సైతం ఖాన్ మాట్లాడుతూ... ట్రిపుల్ త‌లాక్ బిల్లును వ్య‌తిరేకించారు. ముస్లిం స‌మాజంలోని పురుషుల‌పై ఇది తీవ్ర వివ‌క్ష అన్నారు.


logo