బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 18:57:45

పటాకులపై నిషేధం విధించిన ప్రభుత్వం

పటాకులపై నిషేధం విధించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షించారు. చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య అధికారులు, కలెక్టర్లతో చర్చించారు. దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య పెరుగడానికి వరుస పండుగలు, గాలి కాలుష్యం కారణమని చెప్పారు. దీపావళి సమీపిస్తుండటంతో కరోనా కేసుల తీవ్రత, గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో పటాకులపై నిషేధం విధించినట్లు అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఐసీయూ పడకలు, మౌలిక సౌకర్యాలను పెంచుతామని చెప్పారు. ప్రైవేట్‌ దవాఖానల్లో ఐసీయూ పడకల పెంపు ఆదేశంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్లు తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆ స్టేను కోర్టు ఎత్తివేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా పరీక్షలను మరింతగా పెంచి మరణాల రేటు పెరుగకుండా చర్యలు చేపడతామని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

మరోవైపు దేశ రాజధానిలో మూడోసారి కరోనా విజృంభించడంపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రాజధానిగా ఢిల్లీ మారుతున్నదని వ్యాఖ్యానించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.