గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 03:24:28

ఝాడూ ఊడ్చేసింది

ఝాడూ ఊడ్చేసింది

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల్లో.. కేంద్రంలోని బీజేపీ అధికార బలాన్ని ఢీకొన్న ఆప్‌ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నది. ఆప్‌ ఎన్నికల చిహ్నమైన చీపురు మెజారిటీ స్థానాల్లో ప్రత్యర్థులను ఊడ్చిపారేసింది. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 62 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈసారి ఢిల్లీ పీఠం తమదేనని చెప్పిన కమలనాథులు కనీసం రెండంకెల స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. ఢిల్లీని వరుసగా 15ఏండ్ల పాటు (1998-2013) ఏలిన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కూడా ఖాతాను తెరువలేకపోయింది. ఆప్‌కు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్‌కు 4.26 శాతం ఓట్లు వచ్చాయి. దేశంలో కొత్త తరహా రాజకీయాలు పురుడుపోసుకున్నాయని, ఇవి అభివృద్ధి రాజకీయాలని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఓటమిని అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తున్నామని, పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంది. కేజ్రీవాల్‌ను అభినందించిన ప్రధాని మోదీ.. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆప్‌ సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. ఇది విద్వేష రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమని, అభివృద్ధి రాజకీయాలకు నిదర్శనమని, మార్పుకు సంకేతమని పలువురు ప్రతిపక్షనేతలు హర్షం వ్యక్తం చేశారు.

  • ఢిల్లీలో ఆప్‌ ఘనవిజయం l 62 స్థానాలు కైవసం
  • ఎనిమిది స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఖాతా తెరువని కాంగ్రెస్‌
  • కేజ్రీవాల్‌ను అభినందించిన ప్రధాని నరేంద్రమోదీ
  • శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) చరిత్ర సృష్టించింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ వరుసగా మూడోసారి ఘన విజయం సాధించింది. కేంద్రంలోని బీజేపీ అధికార బలాన్ని ఢీకొని మరోసారి తన సత్తా చాటింది. ఆమ్‌ ఆద్మీ (సామాన్యుడి) ముఖ్యమంత్రిగా ముద్రపడిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను రాజధాని వాసులు మరోసారి ఆశీర్వదించారు. చీపురు గుర్తుపై పోటీ చేసిన ఆప్‌ అభ్యర్థులు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రత్యర్థులను ఊడ్చివేశారు. ఆప్‌-బీజేపీ మధ్య ప్రచారం పోటాపోటీగా సాగినప్పటికీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వచ్చాయి. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 62 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఈసారి ఢిల్లీ పీఠం తమదేనని చాటుకున్న బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది. షీలాదీక్షిత్‌ సారథ్యంలో వరుసగా 15 ఏండ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండోసారి ఖాతా కూడా తెరువకుండా చతికిలబడింది. ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఆప్‌ సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.


ఆప్‌ అద్భుత విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. పార్టీ అధినేత కేజ్రీవాల్‌ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడుస్థానాల్లోనూ మూడో స్థానానికి పరిమితమైన ఆప్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం విశేషం. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆప్‌కు దాదాపు 53.57 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 38.51 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అనూహ్యంగా 4.26 శాతానికి పడిపోయింది. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు మనీశ్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌, సత్యేందర్‌ జైన్‌ రాఘవ్‌ చద్ధా, ఆతిషి తదితరులు ఘన విజయం సాధించారు. ఈ నెల 8న మొత్తం 70 స్థానాలకు ఒకేరోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అదేరోజు సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌లో దాదాపు అన్ని సర్వేలు ఆప్‌దే విజయమని స్పష్టం చేశాయి. నగరంలోని 21 కౌంటింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి ఆప్‌ విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికి బీజేపీ దాదాపు 20 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. ఒక దశలో 27 స్థానాల్లో ఆప్‌-బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. కానీ అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆప్‌ సంపూర్ణ ఆధిపత్యంలోకి దూసుకొచ్చింది. ఇక కాంగ్రెస్‌ ఏ ఒక్క స్థానంలోనూ ఆధిపత్యం ప్రదర్శించలేదు. వరుసగా రెండోసారి సున్నాకే పరిమితమైన కాంగ్రెస్‌ ఓటమిని అంగీకరించింది. 


ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత విజయం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేంగా నిరసనలతో ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నిరసనలను వ్యతిరేకించిన బీజేపీ అగ్ర నాయకత్వం ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ మతం పేరిట ప్రజల మధ్య చీలికలు తెస్తున్నదంటూ ఆ పార్టీ ప్రత్యర్థులు ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను బీజేపీ తన ప్రచారాస్ర్తాలుగా మలచుకోగా, ఆప్‌ స్థానిక సమస్యలపైనే దృష్టి పెట్టింది. గత ఐదేండ్లలో విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల రంగంలో తాము చేసిన పనులను ఆప్‌ నాయకులు ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. క్రితంసారి (2015)లో జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలను గెలుపొందిన ఆప్‌ బీజేపీ, కాంగ్రెస్‌లను దాదాపు తుడిచివేసింది. ‘ఈ ఎన్నికలు మేము చేసిన పనుల ఆధారంగా జరుగబోతున్నాయి. మీరు వేచి చూడండి. మేము భారీ విజయాలను సాధిస్తామని మొదటి నుండి చెప్తూ ఉన్నాము’ అని ఆప్‌ ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ మంగళవారం విలేకరులతో చెప్పారు.  పట్‌పర్‌గంజ్‌ నుంచి విజయం సాధించిన అనంతరం డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ‘విద్వేష రాజకీయాలకు’ పాల్పడిందని, ప్రజలు దాని ఎజెండాను తిరస్కరించారని చెప్పారు. ‘తమకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్నారు. తమ తీర్పు ద్వారా జాతీయవాదానికున్న నిర్వచనాన్ని వ్యక్తపరిచారు’ అని పేర్కొన్నారు.

 

వరుసగా మూడోసారి

కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీని ఏర్పాటు చేసిన తరువాత తొలిసారిగా 2013లో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటిసారే 28 స్థానాలను గెలుచుకొని కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 49 రోజులకే అది కుప్పకూలింది. దీంతో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాల్లో ఆప్‌ గెలుపొందింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కలమనాథులను ఆదరించారు. సరిగ్గా 8 నెలలు తిరగకముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీవాసులు మళ్లీ ఆప్‌కు పట్టంగట్టారు.


అసెంబ్లీలో 62 స్థానాలు కైవసం.. 

8 స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఖాతా తెరువని కాంగ్రెస్‌

ఇది అభివృద్ధి రాజకీయాల గెలుపు అన్న కేజ్రీవాల్‌

బీజేపీ విద్వేష రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు: సిసోడియా


కేజ్రీవాల్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు


ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయనకు అభినందన సందేశం పంపారు. కేజ్రీవాల్‌ నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించి పాలన చేస్తే తప్పక ప్రజాభిమానం పొందుతారనడానికి కేజ్రీవాల్‌ విజయం ఓ ఉదాహరణ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేజ్రీవాల్‌కు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఢిల్లీలో హ్యాట్రిక్‌ విజయం నమోదుచేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌జీకి శుభాకాంక్షలు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 


ఐ లవ్‌ యూ ఢిల్లీ

ఢిల్లీ వాసులు వరుసగా మూడోసారి తనకు పట్టంగట్టడంతో ఆనందం వ్యక్తం చేసిన ఆప్‌ నేత కేజ్రీవాల్‌ నగరప్రజలనుద్దేశించి ‘ఐ లవ్‌ యూ ఢిల్లీ’ అని వ్యాఖ్యానించారు. ఆప్‌ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన కేజ్రీవాల్‌ నగరవాసులకు ధన్యవాదాలు తెలిపారు. ‘నన్ను మీ కొడుకుగా భావించి ఓటు వేసిన ఢిల్లీలోని కుటుంబాలన్నింటికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ‘కొత్త తరహా రాజకీయాలు పురుడు పోసుకున్నాయి. ఇది అభివృద్ధి రాజకీయం’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ‘పాఠశాలలు, మొహల్లా (బస్తీ) దవాఖానలు, రోడ్లు నిర్మించినవారికి, చౌకగా విద్యుత్‌ను, తాగునీటిని అందించిన వారికి ఢిల్లీవాసులు ఓటు వేస్తారన్నదే ఈ ఫలితాల నుండి వెలువడుతున్న సందేశం. ఇది దేశానికి శుభ సంకేతం’ అని పేర్కొన్నారు. ‘ఇటువంటి రాజకీయాలు మాత్రమే 21వ శతాబ్దంలో దేశాన్ని ముందుకు తీసుకొనిపోతాయి. ఇది కేవలం ఢిల్లీ విజయం కాదు.. భారత మాత విజయం’ అని చెప్పారు. కేజ్రీవాల్‌ పక్కన ఆయన భార్య సునీత, కుమార్తె కూడా ఉన్నారు. ‘ఈ రోజు మంగళవారం హనుమంతుడిని పూజించే రోజు. నా భార్య పుట్టిన రోజు కూడా.. ఇది హనుమంతుడు ఢిల్లీ వాసులను దీవించిన రోజు. వచ్చే ఐదేండ్లపాటు ప్రజలకు సేవ చేసేందుకు హనుమాన్‌జీ మాకు సరైన మార్గం చూపాలని ప్రార్థిస్తున్నా’ అంటూ కేజ్రీవాల్‌ తన ప్రసంగాన్ని ముగించారు.


లగేరహో కేజ్రీవాల్‌

ఢిల్లీ పీఠం మళ్లీ ఆప్‌కే దక్కడంతో ఆ పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాలు ఆకాశాన్నంటాయి. మంగళవారం ఆప్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి చేరుకొని సంబురాలు జరుపుకున్నారు. బెలూన్లను గాలిలోకి వదులుతూ విజయ సంకేతాలను చూపారు. పార్టీ ప్రచార పాట అయిన ‘లగేరహో కేజ్రీవాల్‌' సాంగ్‌ను పాడుతూ డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ కనిపించారు. ఒకరికొకరు లడ్డూలను తినిపించుకున్నారు. అయితే, వాతావరణం కాలుష్యం అవుతుందన్న కేజ్రీవాల్‌ సూచన మేరకు కార్యకర్తలు పటాకులు కాల్చడాన్ని విరమించుకున్నారు. ఆప్‌ తరఫున మూడు నెలలపాటు ప్రచారం చేసిన ఇంజినీర్‌ రమేశ్‌ శర్మ మాట్లాడుతూ ‘ఆప్‌ విజయం కోసం కష్టపడ్డాం. ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అభివృద్ధి పనులు మాట్లాడుతాయి. దీని ముందు ఏదీ కూడా పనిచేయదు’ అని తెలిపారు. మరో కార్యకర్త ఫరీన్‌ ఖాన్‌ స్పందిస్తూ హిందూ, ముస్లిం అంటూ చేసే రాజకీయాలు ఎక్కడా కూడా సఫలంకావని చెప్పారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఆప్‌ కార్యాలయాన్ని సుందరీకరించారు. నీలి, తెలుపు రంగు బెలూన్లతో అలంకరించడమే కాకుండా కేజ్రీవాల్‌ భారీ కటౌట్‌ను నెలకొల్పారు.


logo
>>>>>>