శుక్రవారం 03 జూలై 2020
National - Feb 06, 2020 , 10:28:22

నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం..

నేటితో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం..

న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. ఈ నెల 8న ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), విపక్ష బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ నేపథ్యంలో జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లలో నిరసనకారులు ఆందోళనలు నిర్వహిస్తుండడంతో ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ కూడా గట్టి పోటీనిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజుతో ప్రచారం ముగుస్తుండడంతో.. ప్రధాన పార్టీలు తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. ఆప్‌ అధ్యక్షలు, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. భారీగా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ప్రత్యర్థి పార్టీలు సైతం.. ఈ రోజును పూర్తిగా వినియోగించుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.

సాయంత్రం 5 గంటల నుంచి దేశ రాజధాని రాష్ట్రంలో మైకులు మూగబోనున్నాయి. సాయంత్రం 5 గంటల అనంతరం ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రచారంతో పాటు మద్యం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. కాగా, జనవరి 14న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఫిబ్రవరి 8న ఈసీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. 11న కౌంటింగ్‌ పూర్తి చేసి, అదే రోజు తుది ఫలితాలు వెల్లడించనుంది.


logo