శుక్రవారం 29 మే 2020
National - Feb 09, 2020 , 10:45:11

ఢిల్లీలో ముగిసిన సమరం

ఢిల్లీలో ముగిసిన సమరం
  • ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు.. 61.46% పోలింగ్‌
  • 2015తో పోలిస్తే దాదాపు 6% తగ్గిన ఓటింగ్‌ 11న ఫలితాల ప్రకటన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సుమారు 61.46 శాతం పోలింగ్‌ నమోదైంది. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది దాదాపు 6 శాతం తక్కువ. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, మధ్యాహ్నం వరకు కూడా మందకొడిగా సాగింది. అనంతరం కాస్త మెరుగుపడింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసే సమయానికి 57.04 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అప్పటికి క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లను కూడా ఓటు వేసేందుకు అనుమతించడంతో పోలింగ్‌ 61.46 శాతానికి పెరిగినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల నుంచి సమాచారం రావాల్సి ఉన్నందుకు ఇది మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.


భారీ భద్రత..

ఎన్నికలకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు. 60వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది కవాతు నిర్వహించారు. మోటార్‌సైకిల్‌ పెట్రోలింగ్‌ కూడా చేపట్టారు. అలాగే పీసీఆర్‌, తక్షణ ప్రతిస్పందక దళాలనూ మోహరించారు. తమ ముందస్తు చర్యల కారణంగా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి రణ్‌బీర్‌సింగ్‌ తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలలోని వీవీప్యాట్లపై ఫిర్యాదులు తలెత్తాయి. వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తన ఫొటో, పేరు కనిపించడం లేదని న్యూఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ సబర్వాల్‌ ఫిర్యాదుచేయడంతో ఎన్నికల అధికారులు వీవీప్యాట్‌ యంత్రాన్ని మార్చారు. ఈశాన్య ఢిల్లీలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉధంసింగ్‌ అనే అధికారి గుండెపోటుతో మరణించారు. షాహీన్‌బాగ్‌, శీలంపూర్‌లలో కొందరి ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. మైనార్టీ ప్రాబల్య ప్రాంతాలైన ముస్తఫాబాద్‌, మతియా మహల్‌, శీలంపూర్‌లో అత్యధిక ఓటింగ్‌ నమోదైంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు జరిగిన షాహీన్‌బాగ్‌, జఫ్రాబాద్‌, జామియానగర్‌లలో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. 


1998 తర్వాత ఇప్పుడే..

ఢిల్లీలో 1998 తర్వాత పోలింగ్‌ శాతం తగ్గడం ఇదే తొలిసారి. 1998లో కేవలం 48.99% మాత్రమే పోలింగ్‌ నమోదైంది. అంతకుముందటి ఎన్నికలతో పోలిస్తే ఇది దాదాపు 12% తక్కువ. 1998 తర్వాత ఢిల్లీలో పోలింగ్‌  క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2003లో 53.42%, 2008లో 57.58%, 2013లో 65.63%, 2015లో 67.47% పోలింగ్‌ నమోదైంది. అయితే ఈసారి 6% తగ్గింది. 


ఓటేసిన ప్రముఖులు..

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌సింగ్‌పురి, హర్షవర్ధన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ, ఆరెస్సెస్‌ నేత రామ్‌లాల్‌ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీఎం కేజ్రీవాల్‌ తన భార్య సునీత, కుమారుడు పులకిత్‌తో కలిసి రాజ్‌పూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పోలింగ్‌ కేంద్రంలో ఓటువేశారు. ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్‌, కేజ్రీవాల్‌ కుమారుడు పులకిత్‌ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  


ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలి: మోదీ

పోలింగ్‌ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్‌. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా. పోలింగ్‌ శాతం పెరిగి రికార్డు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా’ అని పేర్కొన్నారు. మరోవైపు, సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌చేస్తూ.. ‘దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మహిళలందరికీ ప్రత్యేక మనవి. ఇంటిలో మీరు బాధ్యతలు మోసినట్టుగానే.. దేశ రాజధాని బాధ్యతలు కూడా మీపై ఉన్నాయి’ అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ట్వీట్‌చేస్తూ.. ‘అబద్ధాలు, ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి ఢిల్లీకి విముక్తి కల్పించేందుకు ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. 


ఆప్‌ కార్యకర్తపై చేయి చేసుకున్న అల్కా లాంబా


ఉత్తర ఢిల్లీలోని మజ్ను కా తీలా ప్రాంతంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా, ఆప్‌ కార్యకర్త మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అల్కాలాంబా అతడి పై చేయిచేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆప్‌ కార్యకర్త తనను అసభ్య పదజాలంతో దూషించాడని అల్కా లాంబా మీడియాతో పేర్కొన్నారు. అతడిని వెంటనే అరెస్ట్‌ చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదుచేస్తామని ఆప్‌ తెలిపింది. 2015లో ఆప్‌ తరఫున గెలిచిన అల్కా.. అనంతరం ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.


ఓటేసిన షాహీన్‌బాగ్‌ నిరసనకారులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాహీన్‌బాగ్‌ నిరసనకారులు ఓటు వేశారు. అయితే తమ ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బృందాల వారీగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మహిళలతో సహా పలువురు షాహీన్‌బాగ్‌లో గత నెలరోజులకుపైగా శాంతియుత నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. 


logo