గురువారం 09 జూలై 2020
National - Jun 27, 2020 , 17:35:01

108 మంది విదేశీ జమాతీలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ నోటీసులు

108 మంది విదేశీ జమాతీలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌  నోటీసులు

న్యూ ఢిల్లీ : 108 మంది విదేశీ జమాతీలకు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ఈ 108 మంది విదేశీ జమాతీలు నిజాముద్దిన్‌లో ఉన్న తబ్లిగ్‌ జమాత్‌ మర్కజ్‌కు వచ్చి అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారు. ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ వీరికి లుకౌట్‌ సర్క్యులర్‌(ఎల్‌ఓసీ)ను జారీ చేసింది. అయితే ఈ నోటీసులను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిలిపివేసింది.  108 మంది జమాతీలపై వెస్ట్‌బెంగాల్‌ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న విదేశీ జమాతీలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. హోం మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ108 మందికి నోటీసులు ఇచ్చి, వారిని పిలిపించి ప్రశ్నించాలని హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం. హోం ఆదేశానుసారం ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది విదేశీ జమాతీలు ఉన్నారు.. అనే దానిపై ఢిల్లీ పోలీసులు అన్ని రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. 

తబ్లీగ్‌ మతపరమైన జమాత్‌లో పాల్గొన్న మొత్తం 2200 మంది విదేశీ జమాతీలపై చర్యలు తీసుకునేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ 2200 విదేశీ జమాతీలపై ప్రభుత్వం పదేళ్ల నిషేధం విధించబోతోంది. ఇకపై రాబోయే పదేళ్లలో వారు భారతదేశానికి రాలేరు. 47 దేశాలకు చెందిన వీరిని హోం శాఖ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వీరంతా ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన జమాత్‌లో పాల్గొన్నవారే కావడం విశేషం. అంతకుముందు తబ్లీగి జమాత్‌లో పాల్గొన్న 960 మంది విదేశీయులను హోం మంత్రిత్వ శాఖ బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీంతో పాటు వారి వీసాలను సైతం రద్దు చేసింది. logo