బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 20:55:39

ఆ కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐర్‌ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టు

ఆ కానిస్టేబుల్‌పై ఎఫ్‌ఐర్‌ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టు

న్యూ ఢిల్లీ: ఒక వ్యక్తిని బిల్డింగ్‌ పైనుంచి తోసేసిన కానిస్టేబుల్‌, అతడికి సహకరించినవారిపై వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది.  అలాగే, ఈ కేసు దర్యాప్తు జరుగకుండా ప్రయత్నించిన ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ప్రణవ్‌జోషి అసంతృప్తి వ్యక్తంచేశారు. 

నిందితుడైన ప్రవీణ్‌ బురారీ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌. ఈ ఏడాది జూన్ 14 న నిందితుడు కానిస్టేబుల్ ప్రవీణ్, అతడి సహాయకులు ప్రతీక్, చోటు తన భర్తను భవనం పైకప్పుపై నుంచి కిందికి తోసేసారని రేఖ అనే మహిళ దాఖలు చేసిన ఫిర్యాదును గురువారం కోర్టు విచారించింది. తన భర్తకు తీవ్రగాయాలయ్యాయని,  ప్రస్తుతం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగానే ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. కాగా, ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. నిందితులపై ఆరోపణలు తీవ్రతరమైనవి.. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, దీనిపై విచారణ జరపందే ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలను ధ్రువీకరించలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమంటే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేయమని అర్థంకాదని, విచారణలో ఆరోపణలు తప్పు అని తేలితే కేసును మూసివేసే అవకాశం కూడా ఉంది కదా అని పేర్కొంది.  అందువల్ల ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది సరైన చర్య అని తెలిపింది. దీనిపై పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డీసీపీని, వారంలోపు నివేదికను దాఖలు చేయాలని బురారీ ఎస్‌హెచ్‌ఓను కోర్టు ఆదేశించింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo