బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 13:19:29

పార్లమెంట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..!

పార్లమెంట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..!

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ పార్లమెంట్‌లోకి వచ్చారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ సీఎం.. ప్రధాని మోదీతో ప్రత్యేక సమావేశం కోసం పార్లమెంట్‌కు వెళ్లారు. సమావేశాల విరామ సమయంలో ప్రధానిని కలవడానికి కేజ్రీవాల్‌ వెళ్లారు. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, కరోనా వైరస్‌కు సంబంధించి తీసుకొనే పలు జాగ్రత్తలపై కేజ్రీవాల్‌.. ప్రధానితో చర్చించారు. 

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి సంబంధించి.. వ్యతిరేక, అనుకూల వాదుల మధ్య జరిగిన అల్లర్ల కారణంగా.. 40 మందికి పైగా పౌరులు మరణించగా.. 200 మందికి పైగా జనాలు గాయపడిన విషయం తెలిసిందే. ప్రపంచంలో దావానంలా విస్తరిస్తున్న మహమ్మారి వైరస్‌.. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రెండు ప్రధాన సమస్యలపై ప్రధానితో చర్చించినట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీ అల్లర్లు, కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి ప్రధానితో సమావేశమైనట్లు కేజ్రీవాల్‌ తెలిపారు. 

ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇరు ప్రభుత్వాలు కృషి చేస్తాయని కేజ్రీవాల్‌ మీడియాకు తెలిపారు. వారం క్రితం కేజ్రీవాల్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఢిల్లీ అల్లర్లపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 


logo
>>>>>>