శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:46:50

ఆధారాలన్నీ కాలిపోయాయి

ఆధారాలన్నీ కాలిపోయాయి
  • ప్రభుత్వ పరిహారం అందుతుందా?
  • ఐబీ అధికారి కుటుంబానికి రూ.కోటి పరిహారం, ఒకరికి ఉద్యోగం
  • ఆదుకుంటామన్న సీఎం కేజ్రీవాల్‌
  • ఢిల్లీ బాధితుల ఆందోళన

న్యూఢిల్లీ: మత ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ క్రమంగా కోలుకుంటున్నది. అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి చేరుతున్నాయి. బాధితులకు సహాయ కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. హింసాకాండలో సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వ పరిహారాన్ని ఎలా పొందాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అల్లరిమూకలు తమ ఇండ్లకు నిప్పుపెట్టడంతో రేషన్‌, ఆధార్‌, ఓటర్‌, పాన్‌ వంటి కార్డులతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు కూడా కాలిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే బాధితులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా వారికి అవసరమైన సహాయాన్ని, పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని అధికారులు తెలిపారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భరోసా ఇచ్చారు. తక్షణం సహాయం అవసరమయ్యేవారి సమాచారాన్ని ఢిల్లీ రిలీఫ్‌ హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తమతో పంచుకోవాలని ట్విట్టర్‌లో కోరారు. దుండగుల దాడుల్లో ఇండ్లు, దుకాణాలు కాలిపోయినవారికి తక్షణ సాయం కింద రూ.25,000 అందజేస్తున్నట్లు వెల్లడించారు. హత్యకుగురైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. ఢిల్లీ అల్లర్లలో 42 మంది మరణించిన సంగతి తెలిసిందే.


పరీక్షలకు 92 శాతం హాజరు..

ఈశాన్య ఢిల్లీలో సోమవారం జరిగిన 10, 12వ తరగతుల పరీక్షలకు 92 శాతానికిపైగా విద్యార్థులు హాజరైనట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. హింస నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేని వారికి ప్రత్యేకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెడికల్‌, ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల వారికి ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతోనే షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
logo