బుధవారం 27 జనవరి 2021
National - Dec 17, 2020 , 16:43:20

అసెంబ్లీలో రైతు చ‌ట్టాల ప్ర‌తుల‌ను చింపేసిన సీఎం కేజ్రీవాల్‌

అసెంబ్లీలో రైతు చ‌ట్టాల ప్ర‌తుల‌ను చింపేసిన సీఎం కేజ్రీవాల్‌

హైద‌రాబాద్‌:  కేంద్రం కొత్తగా  తీసుకువ‌చ్చిన మూడు రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా రైతులు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు.  రైతు ఆందోళ‌న‌పై ప్ర‌సంగించిన సీఎం కేజ్రీ.. ఓ ద‌శ‌లో కొత్త రైతు చ‌ట్టాల ప్ర‌తుల‌ను చింపేశారు.  క‌రోనా మ‌హ‌మ్మారి వేళ పార్ల‌మెంట్ నిర్వ‌హించి.. త్వ‌రిత‌గ‌తిన రైతు చ‌ట్టాల‌ను తీసుకురావ‌డం ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌ని, రాజ్య‌స‌భ‌లో ఓటింగ్ నిర్వ‌హించ‌కుండా తొలిసారి మూడు రైతు చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చార‌ని, అందుకే ఈ మూడు రైతు చ‌ట్టాల ప్ర‌తుల‌ను అసెంబ్లీలోనే చింపివేస్తున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  కేంద్ర పాల‌కులు బ్రిటీష‌ర్ల క‌న్నా హీనం కారాదు అని ఆయ‌న అభ్య‌ర్థించారు. 

ప్ర‌తి ఒక రైతు భ‌గ‌త్ సింగ్‌లా మారార‌ని, రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుంటున్నామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంద‌ని, రైతు చ‌ట్టాల వ‌ల్ల లాభాలు ఉన్న‌ట్లు వివ‌రిస్తున్నార‌ని, ఇది మ‌తి లేని చ‌ర్య అని అన్నారు.  రైతు చ‌ట్టాల వ‌ల్ల లాభం ఉంద‌ని యూపీ సీఎం అన్నార‌ని, రైతుల నుంచి భూమి లాక్కోవ‌డం లేద‌ని ఆయ‌న అన్నార‌ని, ఇది ఏమైనా లాభ‌మా అని సీఎం కేజ్రీవాల్ ప్ర‌శ్నించారు. రైతులు త‌మ స‌మ‌స్య‌ల్ని తెలిపేందుకు, ఇంకెన్ని త్యాగాలు చేయాల‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ అన్నారు.  


logo