బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 19:05:30

కారులో ఇద్దరు, ఆటోలో ఒక్కరికే అనుమతి

కారులో ఇద్దరు, ఆటోలో ఒక్కరికే అనుమతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించారు. అయితే నాలుగో విడత లాక్‌డౌన్‌లో ఢిల్లీ సర్కారు అనేక సడలింపులు ఇచ్చింది. ఇద్దరు ప్రయాణికులకు మించకుండా టాక్సీలు, క్యాబ్‌లు నడుపుకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించారు. ఆటో రిక్షాలు, ఈ రిక్షాలు, సైకిల్‌ రిక్షాలను కూడా సింగిల్‌ ప్యాసింజర్‌తో నడుపుకోవచ్చని కేజ్రివాల్‌ చెప్పారు. అటు ఆర్టీసీ బస్సు సర్వీసులకు కూడా ఢిల్లీ సర్కారు అనుమతించింది. అయితే బస్సులో 20 మందికి మించి ప్రయాణికులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 

ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు కార్యాలయాలు తెరుచుకోవచ్చని, అయితే సరి, బేసి విధానంలో రోజు విడిచి రోజు ఆఫీసులు తెరుచుకోవాలని సూచించింది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియాలను ప్రారంభించుకోవచ్చని, అయితే ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నది. భవన నిర్మాణ పనులకు కూడా అనుమతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ ప్రకటించారు. అయితే బయటి నుంచి కూలీలు వచ్చేందుకు అనుమతి లేదని, ఢిల్లీలో ఉన్న కూలీలతో మాత్రమే పనులు చేయించుకోవాలని కేజ్రివాల్‌ సూచించారు. హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు, స్పాలపై మాత్రం నిషేధం కొనసాగుతుందన్నారు.


logo