సోమవారం 01 జూన్ 2020
National - May 14, 2020 , 13:52:59

ఢిల్లీలో లాక్‌డౌన్‌.. 5 లక్షలకు పైగా సలహాలు

ఢిల్లీలో లాక్‌డౌన్‌.. 5 లక్షలకు పైగా సలహాలు

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయంపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరినట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ క్రమంలో నేటి వరకు 5 లక్షలకు పైగా సూచనలు, సలహాలు వచ్చాయని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ సూచనలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌తో సాయంత్రం సమావేశమై చర్చిస్తామన్నారు. ఆ నివేదికను కేంద్రానికి కూడా పంపిస్తామని కేజ్రీవాల్‌ చెప్పారు. 

ఢిల్లీ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను ఎండా కాలం సెలవులు ముగిసే వరకు మూసివేయాలని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడినట్లు సీఎం తెలిపారు. హోటల్స్‌ను కూడా మూసివేయాలని ప్రజలు కోరినప్పటికీ, టేక్‌ అవే, హోమ్‌ డెలివరీకి అనుమతిస్తామన్నారు. హెయిర్‌ సెలూన్స్‌, స్పా సెంటర్లు, సినిమా హాల్స్‌, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను తెరవొద్దని ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్పినట్లు సీఎం పేర్కొన్నారు. వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని మార్కెట్‌ అసోసియేషన్స్‌ కోరాయి. అయితే సరి - బేసి విధానంలో మార్కెట్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. 

ఈ సలహాలు, సూచనలపై పూర్తి స్థాయిలో చర్చించి.. ఢిల్లీలో ఏయే వాటికి సడలింపులు ఇవ్వాలనే అంశంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో 7,998 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 106 మంది ప్రాణాలు కోల్పోయారు. 


logo