గురువారం 16 జూలై 2020
National - Jun 19, 2020 , 13:57:50

అమ్మ మందుల కోసం.. 'కరోనా' శవాలకు అంత్యక్రియలు

అమ్మ మందుల కోసం.. 'కరోనా' శవాలకు అంత్యక్రియలు

న్యూఢిల్లీ: ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర చోటెరుగదు.. అంటారు మన పెద్దవాళ్లు. నిజమే! ఆకలిని జయించేందుకు మనం ఉదయం నుంచి రాత్రి వరకు పడరాన్ని పాట్లు పడుతుంటాం. జానెడు పొట్టను నింపేందుకు చెప్పనలవి కాని పనులు చేస్తుంటాం. ఆకలిపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీకి చెందిన ఓ యువకుడు.. తన కుటుంబం కడుపు నింపడం కోసం కరోనాతో మరణించిన వారి మృతదేహాలను మోసుకెళ్లేందుకు సిద్ధపడ్డాడు. కరోనా వైరస్ పేరు చెబితేనే అల్లంత దూరం పారిపోతున్న ఈ రోజుల్లో.. ఈ యువకుడు మాత్రం తన తల్లి మందుల కోసం, చెల్లెలు ఫీజుల కోసం కొవిడ్‌-19తో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు.

దేశ రాజధాని ఢిల్లీలోని సలీమ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 20 ఏండ్ల యువకుడు చాంద్‌ మహమ్మద్‌.. ఇంటర్‌ చదువుతున్నాడు. బాగా చదివి డాక్టర్‌ అవ్వాలని కలలు కన్నాడు. అయితే, పేదరికంతోపాటు తల్లి అనారోగ్యం ఈ కుర్రోడిని ఏదో ఒక పని చేయడానికి పురికొల్పాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి ఆసరాగా నిలిచిన సోదరుడికి కిరాణా కొట్టులో ఉద్యోగం ఊడింది. దాంతో ఇంటిల్లిపాది పస్తులుండటమే  కాకుండా థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్న తల్లికి మందులు కొనేందుకు కావాల్సిన డబ్బు చేతిలో లేకుండా పోయాయి. మరోవైపు చిన్నారి చెల్లి స్కూల్‌ ఫీజుల కట్టేందుకు నయా పైసాలేదు. తల్లి, ఇద్దరు సోదరులు, ముగ్గురు చెల్లెండ్లు ఉండే చాంద్‌ కుటుంబం.. ఇరుగు పొరుగు వారు ఇచ్చే గింజలతోనే రోజులు గడుపుతున్నారు. ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 

దీంతో చాంద్‌ తను ఉద్యోగం వెతుక్కుని కుటుంబ అవసరాలు తీర్చాలనుకున్నాడు. ఎన్ని చోట్ల తిరిగినా లాక్‌డౌన్‌ వల్ల ఏ ఉద్యోగమూ దొరకలేదు. చివరకు వారం క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ దవాఖానలో స్వీపర్‌గా చేరాడు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్స్‌లోకి ఎక్కించి శ్మశానాలకు తీసుకెళ్లడం, అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం కూడా ఈయన పనిలో భాగమని అధికారులు చెప్పారు. నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ డ్యూటీలో నిమగ్నమవుతున్నాడు. రోజూ రెండు, మూడు శవాలను మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వర్తిస్తున్నాడు.

కరోనా ఆగినా.. ఆకలి ఆగదు

కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నదని తెలిసినా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ ఉద్యోగం చేయక తప్పట్లేదు అని తెలిపాడు చాంద్‌. ‘‘ఇంట్లో ఒక పూటే వండుకొన్న రోజులు చాలా ఉన్నాయి. ఈ ఉద్యోగం చేస్తున్నందుకు మా అమ్మ ఏడుస్తోంది. అయితే వైరస్‌ నుంచి బతికి బయటపడే అవకాశముంది కానీ, ఆకలి నుంచి తప్పించుకోలేం కదా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు చాంద్‌. ఇంత ప్రమాదకరమైన ఈ ఉద్యోగం చేస్తున్నందుకు తనకు ఇస్తున్న జీతం రూ.17 వేలే అని, ఏదైనా జరిగితే బీమా సౌకర్యం కూడా లేదని తెలిపాడు. రోజూ ఇంటికి రాగానే స్నానం చేయడంతోపాటు వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, కుటుంబసభ్యులకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నానని చాంద్‌ చెప్పాడు. 'నిత్యం ఉదయాన్నే నమాజ్‌ చేసే తనకు దేవుడిపై నమ్మకం ఉన్నదని, ఆయనే నన్ను సంరక్షించి ఓ మార్గం చూపుతాడు' అని చెప్తున్నాడు చాంద్‌ మహమ్మద్‌.


logo