సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 20:56:02

ఢిల్లీలో కొత్త పరిశ్రమలకు నో

ఢిల్లీలో కొత్త పరిశ్రమలకు నో

న్యూఢిల్లీ : నగరంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రణాళికలో భాగంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్త తయారీ యూనిట్లను అనుమతించబోమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కేవలం సేవ, హైటెక్‌ పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ ‘సేవపైనే ఆధారపడి ఉందని, తయారీపై కాదని’ అన్నారు. కొత్త నిబంధనలతో ఐటీ, మీఇయా, కాల్‌ సెంటర్‌, హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌, బీపీఓ, టీవీ వీడియో ప్రొడక్షన్‌ హౌస్‌లు, మార్కెట్‌ రీసెర్చ్‌, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలతో పాటు వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

న్యాయవాదులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, వాస్తు శిల్పులు, తదితర నిపుణులు అధిక ఖర్చుల కారణంగా శివారు ప్రాంతాలకు తరలివెళ్లారని, ఇప్పుడు వారంతా ఢిల్లీలో కార్యాలయాలను తిరిగి పొందగలుగుతారన్నారు. ఇప్పటి వరకు అవన్నీ కూడా ‘ఆఫీస్‌’ కేటగిరి కిందకు (ఢిల్లీ మాస్టర్‌ ప్లాన్‌లో) వచ్చాయని, వాణిజ్య ప్రాంతాల్లో మాత్రమే స్థాపించవచ్చని సీఎం చెప్పారు. అధిక వాణిజ్య ప్రాంతాల్లో అధిక రేట్ల కారణంగా గుర్గావ్‌, నోయిడా, ఫరీదాబాద్‌కు వెళ్లా్ల్సి వచ్చిందని, ఇప్పుడు వారు పారిశ్రామిక ప్రాంతంలో తక్కువ రేట్లకు కార్యాలయాలు వస్తాయని చెప్పారు. అలాగే ఢిల్లీని ప్రస్తుతం కలుషితం చేసే పరిశ్రమలు అంతమై.. పారిశ్రామిక ప్రాంతాలు శుభ్రంగా, పచ్చగా మారుతాయని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నగరం, దాని చుట్టుపక్కల పారిశ్రామిక కార్యకలాపాలను నిషేధించిన తర్వాత అనేక పెద్ద కంపెనీల తయారీ ప్లాంట్లు ఢిల్లీ నుంచి బయటకు వచ్చాయి. అయినప్పటికీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో 3వేల కంటే ఎక్కువ పరిశ్రమలు పని చేస్తున్నాయి. ప్రతి శీతాకాలంలో ఈ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తితో ఈ ఏడాది కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు గుర్తించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో నిత్యం 5వేలకుపైగా కొవిడ్‌ కేసులు రికార్డవుతున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.