బుధవారం 03 జూన్ 2020
National - Feb 07, 2020 , 02:58:07

రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
  • ప్రచారంలో తీవ్రంగా పోటీపడిన ఆప్‌, బీజేపీ
  • ఉనికిని పెద్దగా చాటుకోని కాంగ్రెస్‌
  • బీజేపీలో సీఎం అభ్యర్థులే లేరు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ముగిసిన ప్రచారం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఓటర్ల ప్రసన్నానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజకీయాలతోపాటు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నిరుద్యోగం వంటి అంశాలను ప్రచారస్ర్తాలుగా చేసుకున్నారు. ప్రచారంలో ప్రధానంగా ఆప్‌, బీజేపీ పోటీపడ్డాయి. ప్రధాని మోదీ రెండు బహిరంగ సభల్లో ప్రసంగించగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు సభల్లో మాట్లాడారు. 


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ తదదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత అభివృద్ధి నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీజేపీ, తర్వాత షాహీన్‌ బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్నది. ‘ద్రోహులను కాల్చి వేయాలంటూ’ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌పై 72 గంటలు, ఢిల్లీ ఎంపీ పర్వేశ్‌ వర్మపై 96 గంటలుపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధం విధించింది. ‘ఉగ్రవాదులకు బిర్యానీ’ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదిత్యనాథ్‌కు గురువారం ఈసీ నోటీసు జారీచేసింది. 


కాగా, ఆప్‌  కన్వీనర్‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆ పార్టీ తరఫున ప్రచారానికి నేతృత్వం వహించారు. కాగా, కేజ్రీవాల్‌ను ‘ఉగ్రవాది’గా బీజేపీ నేతలు పేర్కొనడంపై ఆప్‌ నేతలు 3 రోజులు మౌన ప్రదర్శనలతోపాటు ఇంటింటి ప్రచారం చేశారు. ఆయనను ‘ఢిల్లీవాసుల కొడుకుగా’ నమ్మితే ఆప్‌కు, ‘ఉగ్రవాదిగా’ భావిస్తే బీజేపీకి ఓటు వేయాలని కోరా రు. మరోవైపు గతంలో వరుసగా 3సార్లు ఢిల్లీ పీఠం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారీ ప్రచారంలో పోటీపడలేకపోయింది. ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ మా జీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల సీఎంలు కూడా ప్రచారం చేశారు. 


కాంగ్రెస్‌ ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తుంది

హర్యానాలో మాదిరిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా పేర్కొన్నారు. హర్యానాలో కొన్ని టీవీ చానెళ్లు రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలుస్తుందన్నాయని, కానీ తాము 31 స్థానాల్లో గెలుపొందామని గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని సుర్జేవాలా చెప్పారు.  


బీజేపీలో సీఎం అభ్యర్థులే లేరు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అయ్యే సామర్థ్యం గల బీజేపీ నేతలు ఒక్కరూ లేరని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను మళ్లీ గెలిపిస్తే ఇప్పటి వరకు అమలులో ఉన్న ఉచిత పథకాలతోపాటు కొత్త పథకాలనూ అమలు చేస్తామని గురువారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.  అనధికారిక కాలనీల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్‌తోపాటు షాహీన్‌ బాగ్‌ వద్ద ఆందోళన చేస్తున్న వారికి అక్కడి నుంచి తొలిగించటం వరకూ కేంద్రం చేసిందేమీ లేదన్నారు. బీజేపీ .. సంబిత్‌ పాత్రా, అనురాగ్‌ ఠాకూర్‌లను సీఎం అభ్యర్థులుగా ప్రకటించవచ్చు గదా? సీఎం అభ్యర్థెవరో తెలియనప్పుడు బీజేపీకి ఓటేందుకు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’ అని పేర్కొన్నారు. 


తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు ఫలితాలు షాకిస్తాయి: అమిత్‌ షా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితాలు తుక్డే-తుక్డే గ్యాంగ్‌కు (ఆప్‌, కాంగ్రెస్‌ తదితర పక్షాలకు) షాకిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నా రు. చివరి రోజు ప్రచారంలో భాగంగా ఈశాన్య ఢిల్లీలోని సలీమ్‌పూర్‌, పశ్చిమ ఢిల్లీలోని హరినగర్‌, మడిపూర్‌ ప్రాంతాల్లో మూడు రోడ్‌ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్‌, కాంగ్రెస్‌పై మండిపడ్డారు. షాహీన్‌ బాగ్‌ నిరసనలు ఆప్‌, కాంగ్రెస్‌ జాయింట్‌ వెంచర్‌ అని విమర్శించారు. అందుకే దీని గురించి చర్చించడంతో కేజ్రీవాల్‌, రాహుల్‌ ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. దేశ భద్రత ఎన్నికల అంశం కాదా?, షాహీన్‌ బాగ్‌ వద్ద కూర్చొన్నవారు ‘జిన్నావాలీ ఆజాదీ’కి ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారు?, వారికి తుక్డే-తుక్డే ఎందుకు మద్దతిస్తున్నది?’ అని ప్రశ్నించారు.  


logo