శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 02:55:06

నింగినుంచి నేలకు!

నింగినుంచి నేలకు!
  • ఢిల్లీ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్‌ డకౌట్‌
  • ఘోరంగా పడిపోయిన పార్టీ ఓట్ల శాతం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌.. ఒకప్పుడు ఢిల్లీలో ఎదురులేని పార్టీ. 1998 నుంచి 2013 వరకు వరుసగా మూడుసార్లు ఢిల్లీని పాలించిన పార్టీ. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ డకౌట్‌ అయింది. రెండు ఎన్నికల్లోనూ కనీసం ఖాతా కూడా తెరువలేదు. ఢిల్లీ సీఎంగా దివంగత కాంగ్రెస్‌ నేత షీలాదీక్షిత్‌ ఉన్నప్పుడు ఆ పార్టీకి తిరుగులేకుండా ఉండేది. వరుసగా మూడుసార్లు అధికారంలో కొనసాగింది. కానీ ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్‌ గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నది. గతేడాది జూలైలో ఆమె మరణించడంతో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే సమయంలో ఆమె హయాంలో జరిగిన అభివృద్ధిని ఓట్లుగా మల్చుకోవడంలో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి తరలిపోయింది. దీనికి తోడు పార్టీ క్యాడర్‌లో ఉన్న అంతర్గత విభేదాలు కూడా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి.


 ప్రధానంగా క్యాడర్‌ను కాపాడుకోలేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠానికి చర్యలు తీసుకోకపోవడం, విధాన నిర్ణయాల్లో అధినాయకత్వం జాప్యం వహించడం, సమన్వయ లోయం, వ్యూహాత్మక తప్పిదాలు తదితర విషయాలు కాంగ్రెస్‌ ఓటమికి కారణాలుగా తెలుస్తున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా సోనియా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా కొన్ని సభల్లోనే పాల్గొనడం తదితర కారణాలు కూడా పార్టీ పరాజయానికి కారణంగా తెలుస్తున్నది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల శాతం 4.26కు పడిపోయింది. ఢిల్లీ చరిత్రలోనే తమ పార్టీకి ఇంత తక్కువ శాతం ఓట్లు నమోదు కావడం కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నది. మరోవైపు ఎన్నికల్లో తాము గెలువలేమని భావించిన కాంగ్రెస్‌.. బీజేపీని ఓడించడానికి చాలా స్థానాల్లో బలహీనులైన అభ్యర్థులను నిలబెట్టినట్లు తెలుస్తున్నది. తద్వారా ఓట్లు చీలిపోకుండా ఆప్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు అర్థమవుతున్నది. 


వైఫల్యాలను సమీక్షిస్తాం

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని కాంగ్రెస్‌ తెలిపింది. ఓటమికి గల కారణాలను సమీక్షించడంతోపాటు పార్టీని పునర్నిర్మిస్తామని పేర్కొంది. కాంగ్రెస్‌ ఢిల్లీ అధ్యక్షుడు సుభాశ్‌ చోప్రా స్పందిస్తూ .. ఎన్నికల్లో ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కాగా, ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలువని కాంగ్రెస్‌.. 63 స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది. ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్లు దక్కాయి.


logo