శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 13:36:24

క్షమించుకోలేను.. నా భర్త చావుకు నేనే కారణం

క్షమించుకోలేను.. నా భర్త చావుకు నేనే కారణం

న్యూఢిల్లీ : తన భర్త చావుకు కారణమైన తనను ఎప్పటికీ క్షమించుకోలేనని ఓ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. కొవిడ్‌-19తో భర్త చనిపోవడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె కలలు ఆవిరి అయ్యాయి. 

ఢిల్లీకి చెందిన సురేందర్‌ జిత్‌ కౌర్‌ అనే మహిళ ఢిల్లీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు(ఏసీపీ)గా విధులు నిర్వర్తిస్తోంది. కరోనా విధుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమైన కౌర్‌కు మే 20వ తేదీన టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆమె భర్త చరణ్‌ జిత్‌సింగ్‌, ఆమె 80 ఏళ్ల తండ్రికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. కౌర్‌, జిత్‌సింగ్‌ ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరగా, సాకేత్‌ హాస్పిటల్‌లో తండ్రి చేరాడు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న కౌర్‌.. మే 26వ తేదీన ఇంటికి తిరిగొచ్చారు. కానీ ఆమె భర్త కరోనాతో చనిపోయాడు. 

ఈ సందర్భంగా కౌర్‌ మాట్లాడుతూ.. మే 22న చివరిసారిగా తన భర్తతో మాట్లాడాను. ఒకే ఆస్పత్రిలో ఇద్దరం చేరినప్పటికీ.. వేర్వేరు వార్డుల్లో చికిత్స పొందాము. డాక్టర్‌ తనను పిలిచి.. జిత్‌సింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందించాలని చెప్పారు. ఆ సమయంలో ఆయనతో వీడియో కాల్‌ మాట్లాడాను. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గినట్లు నాకు చెప్పారు. మాట్లాడానికి ఇబ్బంది ఏర్పడటంతో.. నాకు వాట్సాప్‌ ద్వారా మేసేజ్‌లు చేశారు. 

ఆయన చనిపోయే కంటే ముందు రోజు.. నాకు వాట్సాప్‌లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు పంపారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని అడిగాను. ఇప్పుడు ఈ వివరాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. జిత్‌సింగ్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలని అనేక ప్రార్థనలు చేశాను. నా భర్త చనిపోయాడని తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 2023లో నా పదవీవిరమణ తర్వాత కెనడా వెళ్లి సెటిల్‌ అవుదామనుకున్నాం. మాకు ఎన్నో ప్లాన్స్‌ ఉన్నాయి. కానీ అవన్నీ కలగానే మిగిలిపోయాయి ఇప్పుడు. 

తండ్రి అంత్యక్రియలను.. వీడియో కాల్‌ ద్వారా కుమారుడు వీక్షించాడు. విమానాలు లేకపోవడంతో తండ్రి అంత్యక్రియలకు కుమారుడు హాజరు కాలేకపోయాడు. ఇది దురదృష్టకరమని కౌర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. 

నాకు పర్‌ఫెక్ట్‌ పార్ట్‌నర్‌

జిత్‌ సింగ్‌ తనకు పర్‌ఫెక్ట్‌ పార్ట్‌నర్‌ అని కౌర్‌ చెప్పారు. తాను ఎస్‌ఎహెచ్‌వో ర్యాంకు ఆఫీసర్‌గా పని చేసినప్పుడు చేదోడువాదోడుగా ఉన్నారు. ఒక్కోసారి విశ్రాంతి లేకుండా 36 గంటలు పని చేసేదాన్ని.. అలాంటి సమయంలో ఇంటి బాధ్యతలను తాను చూసుకునేవారు అని కన్నీటి పర్యంతమయ్యారు. విధుల వల్ల తాను పర్సనల్‌ జీవితాన్ని కోల్పోయాను. చాలా కార్యక్రమాలను మిస్‌ అయ్యాను. ఇన్ని సంవత్సరాల పాటు పోలీసు ఉద్యోగం చేస్తున్నాను అంటే.. తన భర్త సహకారం వల్లే అని చెబుతూ కౌర్‌ ఉద్వేగానికి లోనయ్యారు. logo