గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 11:16:56

ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్ర‌మించుకోలేరు : రాజ్‌నాథ్ సింగ్‌

ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్ర‌మించుకోలేరు : రాజ్‌నాథ్ సింగ్‌

కోల్‌క‌తా : చైనా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త్వ‌ర‌గా స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దుల్లో శాంతి స్థాప‌న జ‌రగాల‌న్న‌దే భార‌త్ అభిమ‌త‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. భార‌త ఆర్మీ ఉండ‌గా దేశంలోని ఒక్క ఇంచు భూమిని ఎవ‌రూ ఆక్ర‌మించ‌లేర‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

ప‌శ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ర్టాల్లో రెండు రోజుల ప‌ర్య‌ట‌నలో భాగంగా డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మార‌కాన్ని ఆర్మీ ఛీప్ ఎంఎం న‌ర‌వాణేతో క‌లిసి సంద‌ర్శించారు. యుద్ధ స్మారకం వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డున్న ఆయుధాల‌కు ఆయుధ పూజ నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భార‌త్‌, చైనాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న వివాదం త్వ‌ర‌గా ముగిసిపోవాల‌ని భార‌త్ కోరుకుంటోంద‌ని తెలిపారు. శాంతిని నెల‌కొల్ప‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. ఆ విష‌యంలో త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అదే న‌మ్మ‌కం, భ‌రోసాతో చెబుతున్నాను.. దేశంలోని ఒక్క ఇంచు భూమిని కూడా భార‌త జ‌వాన్లు ఇత‌రుల చేతుల్లోకి పోనివ్వ‌రు అని స్ప‌ష్టం చేశారు. భార‌త్ - చైనా స‌రిహ‌ద్దుల్లో ల‌డాఖ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ను చూసిన త‌ర్వాత భార‌తీయ సేన‌లు పోషించిన పాత్ర‌, చూపించిన తెగువ రాబోయే రోజుల్లో చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. భార‌తీయ సేన‌ల శౌర్య‌, పరాక్ర‌మాల గాథ‌లు చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డుతాయ‌ని రాజ్‌నాథ్ అన్నారు.