సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:21:34

అంగుళం కూడా తాకలేరు

అంగుళం కూడా తాకలేరు

దేశ గౌరవాన్ని దెబ్బతీస్తే దీటుగా బదులిస్తాం

లఢక్‌ పర్యటనలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌

లుకుంగ్‌ (లఢక్‌), జూలై 17: భారత్‌ ఇప్పుడు బలహీన దేశం కాదని, ప్రపంచంలోని ఏ శక్తీ మన భూభాగంలో అంగుళాన్ని కూడా తాకలేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టంచేశారు. చైనాతో వివాదం నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన శుక్రవారం లఢక్‌లో పర్యటించారు. అమరజవాన్లకు నివాళుర్పించారు. లుకుంగ్‌ ఫార్వర్డ్‌ పోస్ట్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. తూర్పు లఢక్‌లో నెలకొన్న సరిహద్దు ప్రతిష్ఠంభనను పరిష్కరించుకునేందుకు చైనాతో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అవి ఏ మేరకు ఫలితాన్నిస్తాయన్న దానిపై తానెలాంటి హామీ ఇవ్వలేనని పేర్కొన్నారు. భారత్‌ ఏనాడు ఇతర దేశాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదని, మనదేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా జవాబిస్తామని హెచ్చరించారు. అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోమన్నారు. యావత్‌ ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన దేశం భారత్‌ అని పేర్కొన్నారు. లెహ్‌ సమీపంలోని స్టాక్నా ఫార్వర్డ్‌ బేస్‌లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలను రక్షణమంత్రి వీక్షించారు. ఈ ప్రాంతంలో యుద్ధ సన్నద్ధతను ఆర్మీ, వాయుసేన ప్రదర్శించాయి. పెద్ద సంఖ్యలో గ్రౌండ్‌ కమాండోలు, యుద్ధ ట్యాంకులు, బీఎంపీ ఇన్‌ఫ్యాంట్రీ కంబాట్‌ వెహికల్స్‌, అపాచీ, రుద్ర, ఎం-17 హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రాజ్‌నాథ్‌ వెంట రక్షణదళాల అధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి ఎంఎం నరవణే ఉన్నారు. రాజ్‌నాథ్‌ శనివారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.


logo