బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 06, 2020 , 02:37:57

దుస్సాహసాలు వద్దు!

దుస్సాహసాలు వద్దు!

  • సరిహద్దు మార్చే పనులకు పాల్పడకండి
  • బాధ్యతగా మెలగండి.. ఎల్‌ఏసీని గౌరవించండి 
  • చైనాకు రాజ్‌నాథ్‌సింగ్‌ విస్పష్ట సందేశం
  • మాస్కోలో చైనా రక్షణమంత్రితో భేటీ
  • సరిహద్దు ఉద్రిక్తతలపై రెండున్నర గంటల చర్చ

మాస్కో, సెప్టెంబర్‌ 5: సరిహద్దుల్లో దుస్సాహసాలకు పోకుండా బాధ్యతగా మెలగాలని చైనాకు భారత్‌ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఏకపక్షంగా వాస్తవాధీన రేఖను (ఎల్‌ఏసీ) మార్చే ప్రయత్నం చేయొద్దని స్పష్టంచేసింది. ఈ ఏడాది మే నుంచి ఎల్‌ఏసీ వెంట చైనా, భారత్‌ సైన్యాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మొట్టమొదటిసారి రెండుదేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. షాంఘై సహకార సమాఖ్య (ఎస్‌సీవో) సమావేశాల సందర్భంగా మాస్కోలో శుక్రవారం చైనా రక్షణమంత్రి వీ ఫెంఘేతో భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశమయ్యారు. దాదాపు 2గంటల 20 నిమిషాలపాటు సాగిన చర్చల్లో సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపుపైనే ఎక్కువగా చర్చ జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. 

సమస్యను జఠిలం చేయొద్దు

ఏకపక్షంగా సరిహద్దును మార్చేందుకు ప్రయత్నించి సమస్యను మరింత జఠిలం చేయొద్దని వీ ఫెంఘేకు రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. ఎల్‌ఏసీ సమీప పోస్టుల నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. రెండువైపుల నుంచి బాధ్యతగా సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. ఎల్‌ఏసీ వెంట చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను మోహరించి దురుసుగా వ్యవహరించటం కచ్చితంగా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించటమేనని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి దౌత్య, సైనిక మార్గాల్లో ఇకముందు కూడా చర్చలు కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. సమస్యలు వివాదాలుగా మారకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ సార్వభౌమత్వం సమగ్రతను కాపాడేందుకు సరిహద్దుల్లో భారత బలగాలు ప్రతిక్షణం బాధ్యతతో ఉంటాయని స్పష్టం చేశారు. 

తప్పంతా భారత్‌దే: చైనా

ఎల్‌ఏసీ వెంట ఉద్రిక్తతలపై చైనా మరోసారి పొగరుబోతుతనాన్న ప్రదర్శించింది. తాజా సమస్యలకు పూర్తిగా భారతే కారణమని ఆరోపించింది. రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశంలో తమ రక్షణ మంత్రి వీ ఫెంఘే ఇదే విషయాన్ని స్పష్టంచేశారని చైనా అధికారవర్గాలు శనివారం వెల్లడించాయి. చైనా భూభాగాన్ని ఒక్క ఇంచుకూడా వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నాయి.

రాజ్‌నాథ్‌ బిజీబిజీ

షాంఘై సహకార సమాఖ్య సమావేశాల్లో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ బిజీబిజీగా గడిపారు. ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, తజకిస్థాన్‌ రక్షణ మంత్రులతో శనివారం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ఉజ్బెక్‌ రక్షణమంత్రి కుర్బనోవ్‌ బఖోదిర్‌ నిజమోవిచ్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని ట్వీట్‌ చేశారు. రష్యాలో మూడురోజుల పర్యటన ముగించుకొని శనివారం ఇరాన్‌ పర్యటనకు వెళ్లారు. 

సాయానికి సిద్ధం: ట్రంప్‌

భారత్‌- చైనాల మధ్య ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి చాలా దిగజారిందని పేర్కొన్నారు. సరిహద్దు వివాదంలో అందరూ భావిస్తున్నదానికంటే చైనా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. 


logo