శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 02:20:23

ఎమోషనల్‌ డ్రామాలొద్దు!

ఎమోషనల్‌ డ్రామాలొద్దు!

  • విచారణలో దీపిక పదుకొనె కన్నీరు
  • ఎమోషనల్‌ డ్రామాలొద్దన్న అధికారులు
  • సుశాంత్‌ డ్రగ్స్‌ సేవించేవాడన్న సారా, శ్రద్ధ
  • దీపిక, సారా, శ్రద్ధ తదితరుల ఫోన్లు సీజ్‌.. 

ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ శనివారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే, విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దీపిక మూడుసార్లు కన్నీరు పెట్టుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో అసహనానికి గురైన అధికారులు ఎమోషనల్‌ డ్రామాను (భావోద్వేగ నటనను) కట్టిపెట్టి అడిగిన దానికి సరిగ్గా, సూటిగా సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు, శనివారం విచారణకు హాజరైన నటీమణులు శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ ఎన్సీబీకి కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తున్నది.  

దివంగత నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని, షూటింగ్‌ సమయంలో క్యారవాన్‌లోకి వెళ్లి డ్రగ్స్‌ సేవించాడని వాళ్లు తెలిపారు. కానీ, తామెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని వెల్లడించినట్టు మీడియా పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో కీలకంగా మారిన దీపిక, శ్రద్ధ, సారా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిపుణుల సాయంతో ఆ ఫోన్లను క్లోనింగ్‌ చేసి మరింత సమాచారాన్ని వెలికితీయబోతున్నట్టు సమాచారం. అలాగే, వాళ్ల క్రెడిట్‌ కార్డుల లావాదేవీలపై కూడా నిఘాను పెట్టినట్టు తెలుస్తున్నది.


logo