e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home జాతీయం నిర్‌వీర్యం

నిర్‌వీర్యం

నిర్‌వీర్యం
  • వీర్యంలో తగ్గిపోతున్న శుక్రకణాలు
  • రసాయన ఎరువులు, జీవనశైలి కారణం
  • మహిళల్లో పెరుగుతున్న గర్భస్రావాలు
  • దేశంలో పెరుగుతున్న సంతాన లేమి
  • ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్న పురుగుల మందులు.. రేడియేషన్‌
  • దశాబ్దం క్రితం ఒక్క మిల్లీలీటర్‌ వీర్యంలో సగటు శుక్రకణాల సంఖ్య: 8-10 కోట్లు
  • సీఎస్‌ఐఆర్‌ అధ్యయనం ప్రకారం 2016లో శుక్రకణాలు సంఖ్య-6.4 కోట్లు
  • భారత్‌లో గర్భస్రావాలు ..10-20 శాతం
  • సంతాన లేమి తో బాధపడుతున్న జంటలు2.75 కోట్లు

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అగస్త్య స్పెర్మ్‌ బ్యాంకు. ముందు యువకులతో పెద్ద లైను. అందులో అథ్లెట్లు, క్రీడాకారులు, విద్యావంతులు ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం గలవారు ఉన్నారు. వీర్యాన్ని దానం చేయడానికి వారంతా అక్కడికి వచ్చారు. అందరి నుంచి వీర్యాన్ని సేకరించిన వైద్యులు పరీక్షలు జరిపారు. దాదాపు 70% శాతం మంది యువకుల వీర్యం నాణ్యమైనదిగా, సంతానోత్పత్తి కేంద్రాల్లో భద్రపరిచేందుకు అనువైనదిగా తేలింది. ఆ వీర్యం సాంపిళ్లను ప్రత్యేక సీసాల్లో భద్రపర్చారు. సంతానోత్పత్తి కేంద్రాలకు పంపారు. ఇది దశాబ్దం కిందటి మాట. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. అదే స్పెర్మ్‌ బ్యాంకుకు ఇప్పుడు వచ్చే 70% మంది యువకుల వీర్యంలో నాణ్యత లోపించింది. శుక్రకణాల సంఖ్య తగ్గింది.

భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం. మరో పదేండ్లలో మొదటి స్థానానికి కూడా వెళ్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ దేశ ప్రజలు సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఇది ఎక్కువైంది. సమస్య ప్రమాదకరంగా మారుతున్నదని వైద్యశాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పురుషుల్లో వీర్యం పరిమాణం పడిపోతున్నది. శుక్రకణాల క్రియాశీలత తగ్గిపోతున్నది. మహిళల్లో గర్భస్రావాలు పెరగుతున్నాయి. జీవన శైలి రసాయన ఎరువుల కారణంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. 1979-2016 మధ్య సీఎస్‌ఐఆర్‌ 13వేల మంది పురుషులపై అధ్యయనం నిర్వహించింది. ఈ మధ్య కాలంలో వారిలో శుక్రకణాల సంఖ్య 26 శాతం తగ్గిందని తేలింది. 1979లో ఒక్క మిల్లీ లీటర్‌ వీర్యంలో సగటున 8.7 కోట్ల శుక్రకణాలు ఉండగా 2016లో అది 6.4 కోట్లకు పడిపోయింది. చాలా మందిలో డబ్ల్యూహెచ్‌వో సూచించిన కనిష్ఠ పరిమితి 1.5 కోట్ల కంటే తక్కువకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ‘దశాబ్దం క్రితం ఒక యువకుడి నుంచి సేకరించిన వీర్యం శాంపిల్‌ 3.5-4 మిల్లీలీటర్లు ఉండేది. కానీ ఇప్పుడు 1-1.5 మిల్లీలీటర్లు మాత్రమే ఉంటున్నది’ అని అగస్త్య స్పెర్మ్‌ బ్యాంకు తెలిపింది.

ప్రతి ఆరు జంటల్లో ఒకరు

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వీర్యం నాణ్యత సమస్యతో బాధపడుతున్నవారిలో 25-30% మంది ఇండియా నుంచే ఉన్నారని ఎయిమ్స్‌ సంతానోత్పత్తి విభాగం ప్రొఫెసర్‌ నీతా సింగ్‌ తెలిపారు. ప్రతీ ఆరు జంటల్లో ఒకరు సంతాన లేమితో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 2.75 కోట్ల జంటలు సహజ సంతానోత్పత్తి జరగక దవాఖానలను ఆశ్రయించాయి. 2018-19లో సంతా న లేమి సమస్యతో దవాఖాన ఓపీలో 15 లక్షల జంటలు వైద్యులను సంప్రదించారు.

మహిళల్లోనూ సమస్య

సంతానే లేమి సమస్య కేవలం పురుషుల్లోనే ఉందనుకొంటే పొరపాటు. మహిళల్లో కూడా ఈ సమస్య ఉంది. ఆడపిల్లలు యుక్తవయస్సు రాకుండానే రజస్వల అవుతున్నారు. ఆరోగ్యకరమైన అండాలు తొందరగా విడుదల అవుతున్నాయి. నెలసరి సక్రమంగా ఉండటం లేదు. గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఇండియాలో 10-20 శాతం గర్భస్రావాలు జరుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

కారణమేంటి?

జీవనవిధానం, ఒత్తిడి, ఊబకాయం, వయస్సు ఇవన్నీ ఒకవైపు కారణాలు కాగా.. పంటల ఉత్పత్తికి వాడుతున్న రసాయన ఎరువులు ఈ సమస్యకు ఇటీవల ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ ఎరువుల్లో ఉండే ఎండ్రోకైన్‌ డిస్ప్ట్రింగ్‌ కెమికల్స్‌(ఈడీసీ) శరీరంలోని వినాళ గ్రంధి వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఈ వ్యవస్థ హార్మోన్ల విడుదలను పర్యవేక్షిస్తుంది. హార్మోన్లను సమతౌల్యం చేస్తుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌, మహిళల్లో ఆస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ ప్రత్యుత్పత్తి హార్మోన్లు. ఈడీసీలు ఈ హార్మోన్లు ఉత్పత్తి కాకుండా అడ్డుకొంటున్నాయి. ఫలితంగా సంతాన లేమి సమస్యకు కారణం అవుతున్నాయి. పంటలపై చల్లిన రసాయనాలను మొక్కలు పూర్తిగా శోషించుకోవు. వాటి అవశేషాలు గాలి, నీరు, నేల ద్వారా తిరిగి మనుషుల్లోకి చేరుతున్నాయి. సంతాన లేమి సమస్య కేవలం పట్టణాలకే పరిమతం అనుకొంటే పొరపాటు. గ్రామాల్లో దశాబ్ద కాలంగా ఈ సమస్య పెరుగుతున్నది. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, వైఫై, మైక్రోవేవ్‌ ఓవెన్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌ సంతాన లేమి సమస్యలకు కారణం అవుతున్నది. డీఎన్‌ఏ దెబ్బతినడానికి కూడా ఇవి కారణం అవుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

నేషనల్‌ డెస్క్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిర్‌వీర్యం
నిర్‌వీర్యం
నిర్‌వీర్యం

ట్రెండింగ్‌

Advertisement