మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 18:48:47

గోవాలో కరోనా మరణాలు ఆందోళనకరం: హర్ష వర్ధన్‌

గోవాలో కరోనా మరణాలు ఆందోళనకరం: హర్ష వర్ధన్‌

న్యూఢిల్లీ: గోవాలో కరోనా మరణాలు, మణిపూర్‌లో కరోనా కేసుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్ష వర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గోవా ముఖ్యమంత్రులు, రాష్ట్ర ఆరోగ్య మంత్రులు,  ప్రధాన \ అదనపు ప్రధాన కార్యదర్శులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గోవాలో గత నెలలో మొత్తం మరణాలలో 40 శాతం కరోనా మరణాలు నమోదయ్యాయని, ఇది చాలా ఆందోళన కలిగించిందని తెలిపారు. మిజోరాం రాజధాని ఐజాల్‌లో యాక్టివ్‌ కేసులు 70 శాతంగా ఉన్నాయని చెప్పారు. త్రిపుర, మేఘాలయలో క్రీయాశీలక వయస్కుల్లో ఎక్కువ మరణాలు సంభవించినట్లు గుర్తించామన్నారు. వీటిని నివారించవచ్చని ఆయన అన్నారు.   

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసుల నమోదు తీవ్రత తగ్గిందని హర్ష వర్ధన్‌ తెలిపారు. అయితే అధిక యాక్టివ్‌ కేసులు, అధిక  మరణాల రేటు (2.6) ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ముంబైలో కరోనా మరణాల రేటు 3.5 శాతానికి పెరిగిందని అన్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో యాక్టివ్‌ కేసుల తీవ్రత పెరుగుతున్నదని చెప్పారు. 

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలపై దృష్టి సారించాలని ఆయా రాష్ట్రాలకు మంత్రి హర్ష వర్ధన్‌ సూచించారు. అధిక పాజిటివ్‌ కేసులు ఉన్న జిల్లాల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నెగిటివ్‌ ఫలితం వచ్చిన వారికి తప్పకుండా ఆర్టీయే పరీక్ష నిర్వహించాలని తెలిపారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న సమూహాలు, వైరస్‌ బారినపడే అవకాశమన్న జనాభాపై ఎస్‌ఏఆర్‌ఐ/ ఐఎల్‌ఐ సర్వేల్లో దృష్టి సారించాలని హర్ష వర్ధన్‌ సూచించారు. 

న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.