బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 08:50:14

విశాఖ ఘటనలో 8 మంది మృతి.. సీఎం జగన్‌ స్పందన

విశాఖ ఘటనలో 8 మంది మృతి.. సీఎం జగన్‌ స్పందన

అమరావతి : విశాఖలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్‌ కావడంతో 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గంగరాజు అనే వ్యక్తికి వాయువు ప్రభావంతో కళ్లు కనబడకపోయేసరికి బావిలో పడి మృతి చెందాడు. కొందరు బైక్‌లపై వెళ్తూ కిందపడిపోయారు.

ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్‌ స్పందించారు. విశాఖ  కలెక్టర్‌, కమిషనర్‌తో జగన్‌ ఫోన్‌లో మాట్లాడి.. రసాయన వాయువు లీకైన ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను జగన్‌ ఆదేశించారు.

బాధితులంతా కేజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే 8 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న నివాసాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ వాయువు ప్రభావంతో ఆవులు, దూడలు కూడా చనిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు పూర్తిగా మాడిపోయాయి. 


logo