శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 21:48:07

వ్యాక్సిన్లపై రేపు డీసీజీఐ కీలక ప్రకటన

వ్యాక్సిన్లపై రేపు డీసీజీఐ కీలక ప్రకటన

హైదరాబాద్‌ : దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆదివారం వ్యాక్సిన్లపై భారత్‌ డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. డ్రగ్ కంట్రోలర్ రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. డీసీజీఐ నియమించిన సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ శుక్రవారం కొవిషీల్డ్‌, శనివారం కొవాగ్జిన్‌కు ఆమోద ముద్రవేయాలని డీసీజీఐకి సిఫారసు చేసింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. కొవాగ్జిన్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకా. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో అభివృద్ధి చేసింది. నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసిన నేపథ్యం డీసీజీఐ నిర్ణయం ప్రకటిస్తే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు ఇప్పటికే వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా డ్రై రన్‌ నిర్వహించింది.