ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 10:45:32

11.20 లక్షలు పలి‌కిన దావూద్‌ ఇబ్రహీం ఇల్లు

11.20 లక్షలు పలి‌కిన దావూద్‌ ఇబ్రహీం ఇల్లు

ముంబై: అండ‌ర్‌‌వ‌రల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పూర్వీ‌కు‌లకు చెందిన ఇల్లు ‘ఇ‌బ్రహీం మ్యాన్ష‌న్‌’తో పాటు మరో ఐదు స్థిరా‌స్తు‌లను మంగ‌ళ‌వారం వేలం వేశారు. ఆన్‌‌లైన్‌ ద్వారా నిర్వ‌హిం‌చిన వేలంలో ఈ ఇల్లును ఢిల్లీకి చెందిన లాయర్‌ అజయ్‌ శ్రీవా‌స్తవ్‌ రూ. 11.20 లక్ష‌లకు కొను‌గోలు చేశారు. ఈ ఇల్లు మహా‌రా‌ష్ట్రలో రత్న‌గిరి జిల్లా‌లోని ముంబ్కే గ్రామంలో ఉన్నది. దావూద్‌ కుటుంబం 1983లో ముంబైకి వెళ్ల‌క‌ముందు ఇదే ఇంటిలో నివాసం ఉన్నది.

లాయ‌ర్ శ్రీవాస్త‌వ్ దావూద్ త‌ల్లి అమీన్ బీ, సోద‌రి హ‌సీనా ప‌ర్కార్ పేరిట ఉన్న 25 గుంట‌ల భూమిని కూడా రూ.4.30 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. 

ర‌త్న‌గిరి జిల్లాలోని లోటే గ్రామంలోని ఓ ప్లాట్ సాంకేతిక కార‌ణాల వ‌ల్ల అమ్ముడు పోలేదు. దావూద్ స‌న్నిహితుడు ఇక్బాల్ మిర్చి అపార్ట్‌మెంట్ కూడా అమ్ముడుపోక‌పోవ‌డంతో.. ఈ రెండింటిని మ‌ళ్లీ వేలం వేస్తామ‌ని అధికారులు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా న్యాయ‌వాది శ్రీవాస్త‌వ్ మాట్లాడుతూ.. దావూద్ ఆస్తుల‌ను కొన‌డానికి కార‌ణం.. అత‌నికి తాము భ‌య‌ప‌డ‌ట్లేద‌ని సందేశం ఇవ్వడానికి మాత్ర‌మే అని తెలిపారు. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా త‌ప్ప‌కుండా పోరాడుతామ‌ని, ఈ విష‌యంలో ఏజెన్సీల‌కు కూడా స‌హాయ‌ప‌డుతామ‌ని చెప్పారు. ఉగ్ర‌వాదం పేరుతో అమాయ‌క ప్ర‌జ‌ల‌ను చంప‌డం దారుణ‌మ‌న్నారు. శ్రీవాస్త‌వ్ గ‌తంలో దావూద్ ఆస్తుల‌కు వేలం వేసిన‌ప్పుడు కూడా పాల్గొని అత‌ని ఆస్తుల‌ను కొనుగోలు చేశారు. అప్పుడు దావూద్ అనుచ‌రుల నుంచి ఆయ‌న‌కు బెదిరింపులు వ‌చ్చాయి.