గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 16:17:40

బీహార్‌లో వరదలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

బీహార్‌లో వరదలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

సమస్టిపూర్‌ : బీహార్‌ రాష్ట్రంలో వరదలు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చాలా లోతట్టు గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా దర్భంగా- సమస్టిపూర్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ తెలిపారు. సమస్టిపూర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు గ్రామాలు ముంపునకు లోనయ్యాయి.

కల్యాణ్‌పూర్ బ్లాక్ గ్రామాలను వరద ముంచెత్తడంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ‘మా గ్రామం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపోవడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. ఇప్పటివరకు అధికారులెవ్వరూ రాలేదు. నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది’ అని స్థానికుడొకరు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లో వరదల కారణంగా 7,65,191 మంది ప్రభావితమవగా, 13,877 మంది సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరద బాధితులను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం (ఎన్డీఆర్ఎఫ్) 21 బృందాలను రంగంలోకి దింపింది.


logo