గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 01:59:14

డేంజర్‌ మ్యుటేషన్స్‌

డేంజర్‌ మ్యుటేషన్స్‌

  • దేశంలోని కరోనా వైరస్‌లో 48% అధిక ఉత్పరివర్తనాలు  
  • ప్రమాదకరంగా పైపొర, కొమ్ముల్లో మార్పులు 
  • డేంజరస్‌గా మారుతున్న ‘డీ614జీ’ ప్రొటీన్‌

న్యూఢిల్లీ: కరోనా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను విసురుతున్నది. ఇప్పటికే ఒక్కో దేశంలో ఒక్కోలా కనిపిస్తున్న వైరస్‌.. మరిన్ని ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) చెందుతున్నది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కనిపిస్తున్న వైరస్‌లో 50 శాతం మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా దాని పైపొర, కొమ్ముల నిర్మాణంలో జరుగుతున్న మార్పులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని అమెరికాకు చెందిన లాస్‌ ఆల్మోస్‌ నేషనల్‌ లేబొరేటరీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీరిలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ మాజీ శాస్త్రవేత్త, భారత్‌కు చెందిన డాక్టర్‌ తన్మయ్‌ భట్టాచార్య కూడా ఉన్నారు. భారత్‌లో కరోనాలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల ఉపరితలంలో ‘డీ614జీ’ అనే ప్రొటీన్‌ ఏర్పడిందని , వైరస్‌ మానవ శరీరంలోకి చొచ్చుకెళ్లేందుకు ఇది ఉపయోగపడుతున్నదని తెలిపారు. ఈ ప్రొటీన్‌ వల్ల వైరస్‌ మరింత ప్రమాదకరంగా తయారైందన్నారు. ‘డీ614జీపై అత్యవసరంగా దృష్టిసారించాలి. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐరోపాలో మొదటిసారి కనిపించింది. మిగతా దేశాల్లో విస్తరించినప్పుడు ప్రమాదకరంగా మారుతున్నది’ అని పేర్కొన్నారు. మరో 14 ప్రొటీన్లు ఉత్పరివర్తనాలు చెందుతున్నట్టు గుర్తించారు. మన దేశంలోని వైరస్‌లో ఉన్న 82 కొమ్ములపై భారత సంతతి ప్రొఫెసర్‌ ఎస్‌ఎస్‌ వాసన్‌ బృందం పరిశోధనలు జరుపగా.. 50 శాతం కొమ్ముల్లో ఉత్పరివర్తనాలు కనిపించాయని చెప్పారు. ఆస్ట్రేలియాలోని కామన్‌వెల్త్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో ఈ పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కనిపిస్తున్న వైరస్‌లో ఏవైనా మార్పులు జరిగాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్‌ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వినోద్‌ స్కారియా తెలిపారు. 

కరోనా మొదటి వ్యాక్సిన్‌.. జంతువులపై సక్సెస్‌

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా జంతువులపై జరిపిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. చైనాలోని బీజింగ్‌కు చెందిన ‘సినోవాక్‌ బయోటెక్‌' సంస్థ ‘పికోవ్యాక్‌' పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఏప్రిల్‌ రెండోవారం నుంచి ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా మానవులపై పరీక్షిస్తున్నారు. అంతకుముందు ఈ వ్యాక్సిన్‌ను రీసస్‌ మకావూస్‌ జాతికి చెందిన కోతులపై ప్రయోగించారు. తొలుత వాటికి కరోనా వైరస్‌ సోకేలా చేశారు. వ్యాక్సిన ఇచ్చిన కోతుల్లో వారం రోజుల తర్వాత పరీక్షించగా.. వాటి ఊపిరితిత్తుల్లో వైరస్‌ కనిపించలేదు. అదేసమయంలో వ్యాక్సిన్‌ వేయని కోతులు వైరస్‌ కారణంగా తీవ్ర అవస్వస్థతకు గురయ్యాయి. తమ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నదనడానికి ఇదే ఆధారమని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనీస్‌ మిలిటరీ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ రెండో దశకు చేరాయి.  

‘భారత్‌'లో యాంటీబాడీ థెరపీ!

  • ప్రాజెక్టును భారత్‌ బయోటెక్‌కు అప్పగించిన సీఎస్‌ఐఆర్‌ 
  • 6 నెలల్లో అభివృద్ధి చేస్తామని సీఎండీ కృష్ణా ఎల్లా ధీమా

కరోనాపై పోరులో భాగంగా భారత్‌ బయోటెక్‌ సంస్థ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని చేపట్టనున్నది. అమెరికాలోని విస్కాన్సిస్‌ యూనివర్సిటీతో కలిసి ‘కోర్‌ ఫ్లూ’ పేరుతో వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్న ఈ సంస్థ నేతృత్వంలోని కన్సార్టియంకు ‘న్యూ మిలీనియం ఇండియన్‌ టెక్నాలజీ లీడర్‌షిప్‌ ఇనిషియేటివ్‌' (ఎన్‌ఎంఐటీఎన్‌ఐ) కార్యక్రమం కింద ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్టు కౌన్సిల్‌ ఆఫ్‌ సైటింఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ప్రకటించింది. కాగా, ఈ ప్రాజెక్టును తమకు అప్పగించడంపట్ల సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా హర్షం వ్యక్తంచేశారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఆరు నెలల్లో ప్రతిరక్షకాలను అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 భిన్నమైన వైరస్‌లకు వ్యాక్సిన్‌ కనుగొన్న చరిత్ర భారత్‌ బయోటెక్‌కు ఉందన్నారు.  

ఏమిటీ థెరపీ 

సాధారణంగా వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాటిని అడ్డుకునేందుకు ప్రత్యేకమైన ప్రతిరక్షకాలను (యాంటీబాడీలు) ఉత్పత్తి చేస్తుంది. వీటిల్లో వైరస్‌లోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేసే ప్రతిరక్షకాలను ‘మోనోక్లోనల్‌ యాంటీబాడీ’లు అని పిలుస్తారు. వీటిని సేకరించి కరోనా చికిత్సలో వినియోగిస్తే కచ్చితమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


logo