ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 18:55:47

దళితులపై దాడి... 13 మందికి గాయాలు

దళితులపై దాడి... 13 మందికి గాయాలు

ఘాజీపూర్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గేమర్‌ పోలీస్‌ సర్కిల్‌ పరిధిలో దళిత సామూహిక వర్గంపై ఓ సామాజిక వర్గం దాడి చేసి తీవ్రంగా హింసించింది. ఈ దాడిలో 13 మంది దళితులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. జలీం రామ్‌(45), బలిస్టర్‌(35), సుగ్రీవ్‌(40) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 21 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌ పైభాగంలో లౌడ్‌ స్పీకర్లు అమర్చి అసభ్య పాటలను ప్లే చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అడిగినా పాటలను బంద్‌ చేయలేదు. దీంతో ఓ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు రాడ్లు, కర్రలు, ఆయుధాలతో దళితులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ప్రధాన నిందితులు హైదర్‌, తన్వీర్‌, మోహ్మద్‌ అలీతో పాటు మరో 18 మందిని దాడికి పాల్పడ్డవారిగా గుర్తించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పలుచోట్ల సోదాలు చేపట్టినట్లు చెప్పారు. కేసుకు సంబంధం ఉన్న ఐదుగురి వ్యక్తులను ఇప్పటివరకు నిర్భందంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా జడ్జీ ఓం ప్రకాశ్‌ ఆర్యా, ఎస్‌పీ ఓం ప్రకాశ్‌ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు సందర్శించి వారి భద్రతకు హామీ ఇచ్చారు. 


logo