శనివారం 06 మార్చి 2021
National - Jan 19, 2021 , 11:35:02

ప్రేమ‌ వివాహం.. ద‌ళిత జంట‌కు 2.5 ల‌క్ష‌లు జ‌రిమానా

ప్రేమ‌ వివాహం.. ద‌ళిత జంట‌కు 2.5 ల‌క్ష‌లు జ‌రిమానా

చెన్నై : ద‌ళిత కులానికి చెందిన ఇద్ద‌రు ప్రేమ వివాహం చేసుకోవ‌డంతో వారికి రూ. 2.5 ల‌క్ష‌లు జ‌రిమానా విధించారు. అంతేకాదు వారిద్ద‌రిని ఆల‌యంలోకి రాకుండా అడ్డుకున్నారు కుల పెద్ద‌లు. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరుపాథూరులోని పుల్లూరు గ్రామంలో వెలుగు చూసింది.

కంగ‌రాజ్‌(26) ఎస్సీలోని ముర‌చా పార‌యార్ కులానికి చెందిన వ్య‌క్తి కాగా, జ‌య‌ప్రియ‌(23) థ‌మ‌నా పార‌య కులానికి చెందిన అమ్మాయి. వీరిద్ద‌రూ ప్రేమించుకున్న త‌ర్వాత పెళ్లి చేసుకుంటామ‌ని పెద్ద‌ల‌కు చెప్పారు. ఒకే కుల‌మైన‌ప్ప‌టికీ ఉప కులం వేరుగా ఉండ‌టంతో వారి ప్రేమ పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. చేసేదేమీ లేక 2018 జ‌న‌వ‌రిలో పుల్లూరు నుంచి వెళ్లిన కంగ‌రాజ్‌, జ‌య‌ప్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. చెన్నైలో ఉంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు.

లాక్‌డౌన్‌తో కంగ‌రాజు డ్రైవ‌ర్ ఉద్యోగం పోయింది. దీంతో ఆ దంప‌తులిద్ద‌రూ ఇటీవ‌లే పుల్లూరుకు తిరిగొచ్చారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్నందుకు వారిద్ద‌రికి రూ. 2.5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు కుల పెద్ద‌లు. ఆ కుల సంప్ర‌దాయం ప్ర‌కారం ప్రేమ పెళ్లి చేసుకున్న ప్ర‌తి ఒక్క‌రూ జ‌రిమానా చెల్లించాల్సిందే. కానీ కంగ‌రాజు ఆ డ‌బ్బు కుల పెద్ద‌ల‌కు చెల్లించ‌లేక‌పోయాడు. ఇటీవ‌లే కంగ‌రాజు, జ‌య‌ప్రియ క‌లిసి గ్రామంలో ఉన్న ఆల‌యానికి వెళ్లారు. డ‌బ్బులు చెల్లించ‌నందుకు ఆల‌యంలోకి కూడా వారిని అనుమ‌తించ‌లేదు. దీంతో కంగ‌రాజు దంప‌తులు తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా కంగ‌రాజు మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ప్ర‌తి ఒక్క‌రికి జ‌రిమానా విధించ‌డం మా గ్రామంలో సంప్ర‌దాయంగా మారింద‌న్నారు. సాధార‌ణంగా రూ. 5 వేల నుంచి రూ. 10 వేల‌కు జ‌రిమానా విధిస్తారు. కానీ త‌న‌కు రూ. 2.5 ల‌క్ష‌లు జ‌రిమానా విధించారు. తాను రూ. 25 వేలు మాత్ర‌మే చెల్లిస్తాన‌ని చెప్పాను. కానీ వారు అందుకు అంగీక‌రించ‌లేదు. ఇటీవ‌ల తాను గుడికి వెళ్తే లోప‌లికి వెళ్ల‌నివ్వ‌కుండా అడ్డుకున్నార‌ని కంగ‌రాజు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కంగ‌రాజు, జ‌య‌ప్రియ కుటుంబాల‌కు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే కంగ‌రాజుకు ఎలాంటి జ‌రిమానా విధించ‌లేద‌ని గ్రామ పెద్ద ఒక‌రు పోలీసులకు తెలిపాడు. ఇరు కుటుంబాల మ‌ధ్య చోటు చేసుకున్న గొడ‌వ‌ల వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని పేర్కొన్నాడు. కుల పెద్ద‌లు కేవ‌లం రూ. 500 మాత్ర‌మే జ‌రిమానా విధించిన‌ట్లు ఆయ‌న చెప్పాడు. 

VIDEOS

logo