శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 21:27:08

రోజుకు 10 వేల మందికే శ్రీవారి దర్శనం

రోజుకు 10 వేల మందికే శ్రీవారి దర్శనం

అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు గత 55 రోజులుగా మూతపడి ఉన్నాయి. భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు ప్రముఖ దేవాలయాల తలుపులు మూతపడ్డాయి. గతంలో ప్రతిరోజు 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొనేవారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 10 వేల మందికి మించి అనుమతి ఇవ్వొద్దని ఏపీ సర్కారు భావిస్తున్నది. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు. అన్ని ప్రొటోకాల్స్‌ పాటించడంతోపాటు భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, మాస్కులు ధరించడం, భౌతిక దూరం నిబంధనలు అమలుచేస్తామని తెలిపారు. భక్తులకు అవకాశమిచ్చే ముందే తాము 21 వేల మంది టీటీడీ ఉద్యోగులతో రిహార్సల్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. దర్శనానికి ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తామని, సమస్య తలెత్తితే క్వారంటైన్‌కు పంపించే ఏర్పాట్లుచేస్తామని అన్నారు. తొలిగించిన 1300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను మానవతాదృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇలాఉండగా, తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం  విక్రయాలను శనివారం నుంచి తిరిగి ప్రారంభించారు. దాంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లారు.


logo