శుక్రవారం 10 జూలై 2020
National - Jun 04, 2020 , 02:37:28

ముంబై బచ్‌గయా.. తప్పిన నిసర్గ తుఫాన్‌ ముప్పు

ముంబై బచ్‌గయా.. తప్పిన నిసర్గ తుఫాన్‌ ముప్పు

  • తీరం దాటిన వెంటనే బలహీనం
  • రాయ్‌గఢ్‌ జిల్లాపై అధిక ప్రభావం
  • కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
  • కొనసాగుతున్న సహాయ చర్యలు
  • గుజరాత్‌ తీరానికీ ముప్పు తప్పినట్టే 

ముంబై, జూన్‌ 3: తీవ్ర కల్లోలం సృష్టిస్తుందని భావించిన నిసర్గ తుఫాను వేగంగా బలహీన పడటంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై జల విపత్తు నుంచి తప్పించుకుంది. ముంబై సమీపంలోని అలీబాగ్‌వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీరాన్ని తాకిన తుఫాను సాయంత్రం 4 గంటల తర్వాత ముంబై వైపు ప్రయాణిస్తూ బలహీనపడింది. తుఫాను ధాటికి మహారాష్ట్రలో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ముఖ్యంగా రాయ్‌గఢ్‌ జిల్లాపై తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉంది. తుఫాన్‌ కారణంగా రాయ్‌గఢ్‌ జిల్లాలో ఒకరు, పుణే జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టడంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. మరోవైపు గుజరాత్‌ దక్షిణ తీరానికి కూడా తుఫాన్‌ ముప్పు తప్పింది. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర, గుజరాత్‌ ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలందరూ బాగుండాలని ట్వీట్‌ చేశారు.

తీరందాటిన వెంటనే బలహీనం


భారీ విలయం సృష్టిస్తుందనుకున్న నిసర్గ తుఫాను.. తీరం దాటిన వెంటనే వేగంగా బలహీనపడింది. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో బుధవారం మధ్యాహ్నం చారిత్రక పట్టణం అలీబాగ్‌ను తాకిన తుఫాను, నాలుగు గంటల్లో పూర్తిగా తీరం దాటింది. ఆ తర్వాత బలహీనపడి గాలుల వేగం తగ్గింది. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని లోతట్టు ప్రాంతాలనుంచి 40 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు రోజులపాటు పౌరులు ఇండ్లనుంచి బయటకు రావద్దని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ముంబైతోపాటు పుణే, థానే, రాయ్‌గఢ్‌, పాల్‌ఘర్‌పై తుఫాను ప్రభావం అధికంగా ఉందని భారత వాతావరణ విభాగం ముంబైశాఖ తెలిపింది.

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు

తుఫాను ధాటికి భారీచెట్లు, విద్యుత్‌ స్తంబాలు కూలి రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశారు. తుఫాను ప్రయాణించే మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాల్లో 43 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. 

ఉష్ణమండల తుఫాన్లు ఎలా ఏర్పడుతాయి?


బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తరుచూ తుఫాన్లు ఏర్పడటం పరిపాటే. అయితే అ తుఫాన్లు ఎలా ఏర్పడుతాయన్నది ఆసక్తికరం. ఉష్ణమండల తుఫాన్లుగా పిలిచే ఇవి సముద్రం ఉపరితల ఉష్ణోగ్రత 26.50 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే మించినప్పడు సహజంగా ఏర్పడుతుంటాయి. అధిక ఉష్ణోగ్రత కారణంగా సముద్రపు నీరు ఆవిరయ్యి భారీ మేఘాలు ఏర్పడుతాయి. ఆ మేఘాలను వేడిగాలి వేగంగా కదిలిస్తూ సర్పిలాకారంలో అల్పపీడన ప్రదేశం చుట్టూ తిరిగేలాచేస్తుంది. దాంతో మేఘాలు భారీ తుఫానుగా రూపాంతరం చెందుతాయి. ఉష్ణాన్ని కోల్పోయిన మేఘాలు తమలోని నీటిని పట్టిఉంచే శక్తిని కోల్పోవటంతో భారీ వర్షాలు కురుస్తాయి.   


logo