శుక్రవారం 03 జూలై 2020
National - Jun 03, 2020 , 22:22:49

ముంబైకి తప్పిన 'నిసర్గ' ముప్పు

ముంబైకి తప్పిన 'నిసర్గ' ముప్పు

ముంబై: కల్లోలం సృష్టిస్తుందని భావించిన నిసర్గ తుపాను.. బలహీన పడటంతో ముంబై జల విపత్తు నుంచి తప్పించుకున్నది. ముంబై సమీపంలోని అలీబాగ్‌వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తీరాన్ని తాకడంతో.. సాయంత్రం 4 గంటల తర్వాత ముంబై వైపు ప్రయాణిస్తూ బలహీనపడింది. తుపాను ధాటికి మహారాష్ట్రలో పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. రాయ్‌గఢ్‌ జిల్లాపై తుపాన్‌ ప్రభావం అధికంగా ఉంది. తుఫాన్‌ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టడంతో.. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. మరోవైపు గుజరాత్‌ దక్షిణ తీరానికి కూడా తుఫాన్‌ ముప్పు తప్పింది. 

ఇటీవల పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసిన అంఫన్‌ తుఫాను మాదిరిగానే నిసర్గ కూడా విలయం సృష్టిస్తుందని ముందుగా అంచనావేసినప్పటికీ.. తీరం దాటిన వెంటనే వేగంగా బలహీనపడింది. ఒకవైపు లాక్‌డౌన్‌.. మరోవైపు నిసర్గ బారిన పడకుండా ప్రభుత్వ హెచ్చరికలతో జనమంతా ఇండ్లకే పరిమితమైయ్యారు. బీచ్‌లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలన్నీ నిర్మానుశ్యంగా మారాయి. 45 మందితో కూడిన ఒక్కో బృందం రోడ్లపై అడ్డంగా కూలిన చెట్లను, విద్యుత్‌ స్తంభాలను తొలగించి తక్కువ రవాణా, విద్యుత్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నదని ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. భారత నేవీ కూడా ముంబై తీరంలో అత్యవసర సహాయ బృందాలను సిద్ధంగా ఉంచింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిలిపివేసి.. సాయంత్రం 7 గంటల తర్వాత పునరుద్ధరించారు. సెంట్రల్‌ రైల్వే పలు ప్రత్యేక రైళ్లను రీషెడ్యూల్‌ చేసింది. 


logo