బుధవారం 08 జూలై 2020
National - Jun 03, 2020 , 09:35:30

ముంబై దిశ‌గా దూసుకొస్తున్న నిస‌ర్గ‌.. 110 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు

ముంబై దిశ‌గా దూసుకొస్తున్న నిస‌ర్గ‌..  110 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు

హైద‌రాబాద్‌:  నిస‌ర్గ తుఫాన్ ముంబై దిశ‌గా దూసుకువస్తున్న‌ది. ఇవాళ ఉద‌యం నిస‌ర్గ‌.. తీవ్ర తుఫాన్‌గా మారింది. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ తీరాల వైపు అది  ప‌య‌నిస్తున్న‌ది.  ఇవాళ మ‌ధ్యాహ్నం ముంబై తీరాన్ని నిస‌ర్గ తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ బాధితుల‌తో అల్లాడుతున్న ముంబై మ‌హాన‌గ‌రానికి ఇప్పుడు తుఫాన్ మ‌రో పెను ప్ర‌మాదంగా మార‌నున్న‌ది. గ‌త రెండు వారాల్లో భార‌త్‌పై ప్ర‌భావం చూపనున్న రెండ‌వ తుఫాన్ ఇది.  ఆర్థిక‌న‌గ‌ర‌మైన ముంబైని ఓ తుఫాన్ తాక‌డం గ‌త వందేళ్ల‌లో తొలిసారి కానున్న‌ది. బీచ్‌లు, పార్క్‌లు, తీరం వ‌ద్ద‌కు ఎవ‌రూ రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, డ‌మ‌న్ అండ్ డ‌యూ, దాద్ర న‌గ‌ర్ హ‌వేలీలో హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.  

సైక్లోన్ నిస‌ర్గ మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు ఇవాళ ఐఎండీ పేర్కొన్న‌ది.  వాయు వేగం కూడా పెరిగిన‌ట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబ‌డి గంట‌కు 110 కిలోమీట‌ర్ల చొప్పున బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్న‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది.  ముంబై ప‌రిస‌ర ప్రాంతాల్లో సుమారు 20 ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాల‌ను మోహ‌రించారు. ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ముంబైలోని బాంద్రాలో తాత్కాలిక సెంట‌ర్ల‌లో చికిత్స పొందుతున్న కోవిడ్‌19 పేషెంట్ల‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. మ‌హారాష్ట్ర‌లోని కొంక‌న్ జిల్లాల‌తో పాటు పుణె జిల్లాకు ప్ర‌త్యేకంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. సైక్లోన్ నిస‌ర్గ నేప‌థ్యంలో రైల్వే శాఖ కూడా ప్ర‌త్యేక భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. ప్ర‌స్తుతం ముంబై తీరానికి 175 కిలోమీట‌ర్ల దూరంలో నిస‌ర్గ ఉన్న‌ట్లు  ఐఎండీ చెప్పింది.


logo