బుధవారం 27 జనవరి 2021
National - Dec 02, 2020 , 12:27:59

ముంచుకొస్తున్న ‘బురేవి’

ముంచుకొస్తున్న ‘బురేవి’

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. సైక్లోన్‌ ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పు-ఆగ్నేయంగా 370, పంబన్‌కు 600, కన్యాకుమారికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాబోయే 12గంటల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి ట్రింకోమలి దగ్గరలో తీరం దాటి.. గురువారం గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, కొమొరిన్‌ ప్రాంతం నుంచి పశ్చిమ - నైరుతి దిశగా మళ్లి ఈ నెల 4వ తేదీన దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి-పంబన్‌ తీరాన్ని తాకుతుందని స్థానిక తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ పువిరసన్‌ పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావంతో బుధ, గురువారాల్లో తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రామనాథపురం, తిరునెల్వేలి, తెన్కాసి, తూత్తుకుడి, కన్యాకుమారి, పుదుకొట్టై, శివగంగై, విరుద్‌నగర్‌ మీదుగా 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

అధికారులతో తమిళనాడు సీఎం సమీక్ష


తమిళనాడుపై బురేవి తుఫాను ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధికారులతో ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి సమావేశమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. మధురై, కన్యాకుమారి, తూత్తుకుడి, తురునెల్వేలి జిల్లాల్లో తొమ్మిది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని సూచించారు. కొవిడ్‌ నేపథ్యంలో శిబిరాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని, హ్యాండ్‌ శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. విద్యుత్‌ సమస్యలు ఎదురయ్యేతే తక్షణ సహాయక చర్యలు అందించేందుకు వెయ్యి మందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్‌ఆర్‌డీఆర్‌ బృందాలను తూత్తుకుడి, కన్యాకుమారిలో అధికారులు మోహరించారు. 

కేరళలోనూ హై అలర్ట్‌


తుఫాను ప్రభావంతో దక్షిణ కేరళలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాలతో పాటు భారీగా గాలులు వీస్తాయని, సముద్రం అల్లకోల్లంగా ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం, శుక్రవారం సైతం కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, ఇడుక్కి, జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేశారు. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజలలో గురువారం రెడ్ అలర్ట్, తిరువనంతపురం, ఇక్కుడి జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మూడు రోజుల పాటు రాష్ట్ర తీర ప్రాంతాల్లో 75-85 కిలోమీటర్లు, గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ మంత్రి స్పందించారు. తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించాలని సూచించారు.


logo