బుధవారం 27 మే 2020
National - May 20, 2020 , 16:13:38

తీరాన్ని తాకిన అతి తీవ్ర అంఫా‌న్‌

తీరాన్ని తాకిన అతి తీవ్ర అంఫా‌న్‌

హైద‌రాబాద్‌: అతి తీవ్ర తుఫాన్‌గా మారిన అంఫ‌న్ ఇవాళ ఒడిశాలోని పార‌దీప్ దీవులను దాటింది. ప్ర‌స్తుతం ఆ తుఫాన్ బాల‌సోర్ వ‌ద్ద కేంద్రీకృత‌మై ఉన్న‌ద‌ని, మ‌రో మూడు గంట‌ల్లో అది తీరాన్ని పూర్తిగా దాటేస్తుంద‌ని, దీంతో ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్పెష‌ల్ రిలీఫ్ క‌మిష‌న‌ర్ ప్ర‌దీప్ కుమార్ జెనా తెలిపారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు తుఫాన్ తీరాన్ని తాక‌డం ప్రారంభ‌మైన‌ట్లు చెప్పారు.  అయితే ఈ ప్ర‌క్రియ ఓ మూడు గంట‌ల పాటు ఉంటుంద‌న్నారు. భ‌ద్ర‌క్‌లో ఒక‌రు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంద‌న్నారు.   

తుఫాన్ వ‌ల్ల ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఉన్న చాందీపూర్ వ‌ద్ద బ‌ల‌మైన గాలులు వీస్తున్నాయి. అక్క‌డ భారీ వ‌ర్షాలు కూడా కురుస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ ద‌ళాలు.. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా, ఒడిశా బోర్డ‌ర్ వ‌ద్ద రోడ్డుపై వృక్షాలు నేల‌కూలాయి.  విద్యుత్తు స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు ముమ్మ‌రంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నారు. 

ఫ‌ణి తుపాన్ అనుభ‌వాల ఆధారంగా.. అన్ని బృందాల‌ను యాక్టివ్‌గా ఉంచామ‌ని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్ర‌ధాన్ తెలిపారు.  ట్రీ క‌ట్ట‌ర్లు, పోల్ క‌ట్ట‌ర్లు అందుబాటులో ఉంచామ‌న్నారు.  బెంగాల్‌లో మొత్తం 5 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఒడిశాలో కూడా ల‌క్ష‌న్న‌ర మందిని త‌ర‌లించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 


logo