గురువారం 04 జూన్ 2020
National - May 22, 2020 , 01:39:14

శోకతప్త బెంగాల్‌

శోకతప్త బెంగాల్‌

  • బెంగాల్‌లో 72 మందిని బలిగొన్న ‘అంఫాన్‌'
  • కోల్‌కతా, తీరప్రాంత జిల్లాలు అతలాకుతలం
  • కూలిన చెట్లు, ఇండ్లు, టవర్లు.. తెగిన వంతెనలు
  • రాష్ట్రంలో భారీ నష్టాన్ని మిగిల్చి వెళ్లిన ‘అంఫాన్‌'
  • కూలిన చెట్లు, ఇండ్లు, టవర్లు.. కొట్టుకుపోయిన బ్రిడ్జీలు
  • 84 మంది మృతి.. బెంగాల్‌లో 72, బంగ్లాదేశ్‌లో 10, ఒడిశాలో ఇద్దరు
  • 100 ఏండ్లలో ఇదే భయానక తుఫాన్‌: వాతావరణ నిపుణులు

కోల్‌కతా/ఢాకా: ‘అంఫాన్‌' సృష్టించిన విలయానికి పశ్చిమ బెంగాల్‌ చిగురుటాకులా వణికిపోయింది. తుఫాన్‌ మిగిల్చిన నష్టం గురువారం వెలుగులోకి వచ్చింది. తుఫాన్‌ధాటికి భారీ వృక్షాలు, స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ముఖ్యంగా రాజధాని కోల్‌కతాలో తుఫాన్‌ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెయ్యికి పైగా కమ్యూనికేషన్‌ టవర్లు దెబ్బతిన్నాయి. దీంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కోల్‌కతా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన పలు విమానాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గత వందేండ్లలో రాష్ట్రంపై ఇంతటి భయానక తుఫాన్‌ విరుచుకుపడటం చూడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు. ‘అంఫాన్‌' కారణంగా ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. 44.8 లక్షల మంది ప్రభావితమయ్యారు. బంగ్లాదేశ్‌లో పది మంది మరణించారు.

నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: మమత


కరోనా వైరస్‌ కంటే ‘అంఫాన్‌' ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నదని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో 72 మంది మరణించినట్టు వెల్లడించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు. తన జీవిత కాలంలో ఇలాంటి తుఫాన్‌ను ఎప్పుడూ చూడలేదన్నారు. తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించి అన్ని విధాలుగా రాష్ర్టాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, బెంగాల్‌లో అంఫాన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌కు యావత్‌ జాతి అండగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు.

సైక్లోన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా-మహాపాత్ర


1999లో ఒడిశాపై ‘ఫైలిన్‌' తుఫాన్‌ విరుచుకుపడింది. దీంతో దాదాపు 15 వేల మంది మరణించారు. అయితే, తుఫాన్‌కు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో లక్షల్లో జరుగాల్సిన ప్రాణ నష్టం వేలతోనే ఆగింది. దీనికి కారణం డాక్టర్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) డెరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ఆయన కచ్చితమైన విశ్లేషణలే ఇప్పుడు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ‘అంఫాన్‌' పెను విపత్తు నుంచి రక్షించాయి. ‘సైక్లోన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన మహాపాత్ర 1992, 1999, 2013లో భారత్‌పై పంజా విసిరిన పలు తుఫాన్‌ల సమాచారాన్ని ముందస్తుగా ప్రభుత్వానికి అందించి అప్రమత్తం చేశారు. దీంతో భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం తప్పింది. సరికొత్త సాంకేతికతను ఉపయోగించడం వల్లే ‘అంఫాన్‌'కు సంబంధించిన సమాచారాన్ని 3.5 రోజుల ముందుగానే కచ్చితంగా అంచనా వేయగలిగామని మహాపాత్ర తెలిపారు. 


logo