ఆదివారం 24 జనవరి 2021
National - Nov 25, 2020 , 00:14:59

నివురుగప్పిన నివర్‌

నివురుగప్పిన నివర్‌

  • తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం
  • 120-145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి: ఐఎండీ
  • తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!
  • తమిళనాడులో రవాణా సేవలు నిలిపివేత, నేడు సెలవు
  • నేటి సాయంత్రం తమిళనాడులో తీరందాటే అవకాశం

చెన్నై, నవంబర్‌ 24: ‘నివర్‌' తుఫాన్‌ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్‌, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నివర్‌ ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణపై ఉంటుందని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు, తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బుధ, గురువారాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తర తమిళనాడు జిల్లాలపై నివర్‌ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ఐఎండీ డీజీ  మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పుదుచ్చేరికి 310 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమైంది. మంగళవారమే తమిళనాడు, పుదుచ్చేరిలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. చెన్నైలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కరైకల్‌ నుంచి 30 పడవల్లో సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారుల జాడ తెలియడంలేదు. 

తమిళనాడు, పుదుచ్చేరిలో హైఅలర్ట్‌

నివర్‌ ముప్పు పొంచి ఉండడంతో ఆయా రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. 22 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు పళనిస్వామి, నారాయణస్వామితో మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం బుధవారం సెలవుదినంగా ప్రకటించింది. రవాణా సేవలను నిలిపివేసింది. పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. పుదుచ్చేరిలో దుకాణాలను గురువారం దాకా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణలో 3 రోజుల పాటు వానలు 

  • హైదరాబాద్‌కు కూడా వర్ష సూచన

హైదరాబాద్‌, నమస్తే  తెలంగాణ: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో బుధవారం నుంచి తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం (26వ తేదీ) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురియవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్నం తెలిపారు. దక్షిణ తెలంగాణలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 26, 27 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని అధికారులు తెలిపారు. 


logo